Team India : ‘సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెనే.. సరైన నాయకుడు అతడే..’
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 30, 2024 / 09:31 AM IST
Suryakumar Yadav
Team India : టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు చెప్పాడు. పొట్టి ప్రపంచకప్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని చాలా మంది భావించారు. అయితే.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు సెలక్టర్లు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి కోచ్‌గా గంభీర్, కెప్టెన్‌గా సూర్య ప్రయాణం మొదలైంది. కాగా.. లంకతో టీ20, వన్డే సిరీస్‌కు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
తాజాగా దీనిపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ తాత్కాలిక కెప్టెనే అని అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌కు భారత జట్టులో ఉన్న వారిలో కెప్టెన్సీ చేయగల సరైన ఆటగాడు కనిపించలేదని తాను అనుకుంటున్నట్లు స్టైరిస్ తెలిపాడు. టీమ్ఇండియా దీర్ఘకాలిక కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై గంభీర్ దృష్టి సారించాడని, అందుకు శుభ్‌మన్ గిల్ సరైన వాడని చెప్పారు.
Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత షెడ్యూల్.. మను మళ్లీ మురిపిస్తుందా..?
దాదాపు పదేళ్ల పాటు అతడు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందన్నాడు. అయితే.. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి గిల్ సిద్ధంగా లేడన్నారు. అతడికి కాస్త అనుభవం వచ్చిన తరువాత కెప్టెన్‌గా చేస్తే బాగుంటుంది. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్‌గా చేశారు. ఒకవేళ కెప్టెన్‌గా సూర్య రాణిస్తే టీ20 ప్రపంచకప్ 2024 వరకు అతడిని కొనసాగించవచ్చునని తెలిపాడు. ఆ తరువాత గిల్ లేదా కెప్టెన్సీ సత్తా ఉన్న మరో ఆటగాడు ఎవరైనా ఉంటే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని, నిజంగా ఇది మంచి నిర్ణయం అని స్టైరిస్ అన్నాడు.
సూర్య కెప్టెన్సీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
