×
Ad

IND vs SA : అందుక‌నే ఓడిపోయాం.. ఆ ఇద్ద‌రూ అద్భుతం.. మేం కోరుకునేది అదే.. టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌..

ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవ‌డంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు.

T20 World Cup 2026 IND vs SA Suryakumar Yadav comments after India lost match to South Africa

IND vs SA : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భార‌త్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. సూప‌ర్‌-8లో భాగంగా ఆదివారం ద‌క్షిణాప్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యం పాలైంది. 188 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలో 76 ప‌రుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఓట‌మిపై స్పందించాడు. బ్యాటింగ్ వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఓడిపోయామ‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్ (63; 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేశాడు. డేవాల్డ్ బ్రెవిస్ (45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (44నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స‌ర్లు) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, శివ‌మ్‌దూబె లు త‌లా ఓ వికెట్ సాధించారు.

T20 World Cup 2026 : వ‌ర్షం కార‌ణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ ర‌ద్దు.. పాకిస్థాన్ సెమీస్ చేరుకునేందుకు ఇంకా ఛాన్సుందా?

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 18.5 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబె (42; 37 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స‌ర్లు) రాణించాడు. మిగిలిన వారంతా ఘోరంగా విఫ‌లం కావ‌డంతో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కేశ‌వ్ మ‌హారాజ్ మూడు వికెట్లు తీశాడు. కార్బిన్ బాష్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐడెన్ మార్‌క్ర‌మ్ ఓ వికెట్ సాధించాడు.

ప‌వ‌ర్ ప్లేలో వికెట్లు కోల్పోవ‌డంతోనే..

మ్యాచ్ అనంత‌రం భార‌త టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. ప‌వ‌ర్ ప్లేలో వికెట్లు కోల్పోవ‌డంతోనే మ్యాచ్‌లో వెనుక బ‌డ్డామ‌ని, ఆ త‌రువాత పుంజుకోలేక‌పోయామ‌ని చెప్పుకొచ్చాడు. ప‌వ‌ర్ ప్లేల్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫ‌లితం మ‌రో ర‌కంగా ఉండేద‌ని అభిఫ్రాయ ప‌డ్డాడు.

ఇక మ్యాచ్ ఆరంభంలో తాము మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ట్లు చెప్పుకొచ్చాడు. 21 ప‌రుగుల‌కే భార‌త బౌల‌ర్లు మూడు వికెట్లు తీసి ద‌క్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టార‌ని అన్నాడు. అయితే.. 7 నుంచి 15 ఓవ‌ర్ వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు చాలా బాగా ఆడార‌ని అన్నాడు. ఆ త‌రువాత ఇన్నింగ్స్ ఆఖ‌రిలో మ‌రోసారి తాము పుంజుకున్నామ‌న్నాడు. మొత్తంగా చూస్తే టీమ్ఇండియా బౌల‌ర్లు మంచిగానే బౌలింగ్ చేశార‌న్నాడు.

ల‌క్ష్య ఛేద‌న విష‌యానికి వ‌స్తే.. తాము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంద‌న్నాడు. ముఖ్యంగా 180 నుంచి 185 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేట‌ప్పుడు ప‌వ‌ర్ ప్లేలో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేయ‌డం చాలా ముఖ్యం అని తెలిపాడు. అయితే.. ప‌వ‌ర్ ప్లేలోనే మ్యాచ్‌లు గెల‌వ‌క‌పోవ‌చ్చున‌ని, కానీ.. ప‌వ‌ర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మాత్రం మ్యాచ్‌లో ఓడిపోవ‌చ్చున‌ని అన్నాడు.

Shikhar Dhawan : మళ్ళీ పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌.. ఫోటోలు వైర‌ల్

మేం ప‌వ‌ర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం. ల‌క్ష్యాన్ని ఛేద‌న‌లో భాగ‌స్వామ్యాలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని, తాము చిన్న చిన్న భాగ‌స్వామ్యాల‌ను కూడా నెల‌కొల్ప‌లేక‌పోయామ‌న్నాడు. అయితే.. ఆట‌లో ఇదంతా ఓ భాగ‌మేన్నాడు. ఇక ఈ ఓట‌మి నుంచి తాము పాఠాలు నేర్చుకుంటామ‌న్నాడు. తాము బ‌లంగా తిరిగి వ‌స్తామ‌ని అన్నాడు.

బుమ్రా-అర్ష్‌దీప్ అదుర్స్‌..

‘జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రి తెలుసు. వారిద్ద‌రూ ఈ రోజు అద్భుతంగా బంతులు వేశారు. ఇద్ద‌రూ క‌లిసి ఎనిమిది ఓవ‌ర్లు వేసి 45 నుంచి 50 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టారు. మేం కోరుకునేది అదే. ఈ జోడి చాలా బాగా బౌలింగ్ చేసింది. వారిద్ద‌రు జ‌ట్టులో ఉండ‌డం చాలా ముఖ్యం.’ అని సూర్య అన్నాడు.

ఇక తదుప‌రి భార‌త జ‌ట్టు జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఈ ఓట‌మిని మరిచిపోయి మా స‌హ‌జ శైలిలో బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తాము అని ఆశిస్తున్న‌ట్లు సూర్య తెలిపాడు.