T20 World Cup 2026 : ఎంత పని చేశావురయ్యా.. డికాక్ చేసిన ఒక్క మిస్టేక్.. ప్రపంచకప్ నుంచి సౌతాఫ్రికా ఔట్.. !
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చేసిన ఓ చిన్న తప్పిదం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : March 5, 2026 / 11:39 AM IST
T20 World Cup 2026 SA vs ENG Quinton de Kock miss the Tim Seifert catch in semis match
- ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల మధ్య సెమీస్ మ్యాచ్
- క్యాచ్ మిస్ చేసిన క్వింటన్ డికాక్
- భారీ మూల్యం చెల్లించుకున్న సౌతాఫ్రికా!
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చేసిన ఓ చిన్న తప్పిదం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. డికాక్ గనుక సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఆ జట్టు ఫైనల్‌కు చేరి ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి డికాక్ చేసిన ఆ తప్పు ఏంటి అనేది ఓ సారి చూద్దాం..
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేది క్రికెట్‌లో ఓ ప్రసిద్ధ నానుడి. క్యాచ్‌లు అందుకుంటేనే మ్యాచ్‌లు గెలవగలం అని దీని అర్థం. ఒక్క క్యాచ్ మిస్ చేసినా సరే మ్యాచ్ ఫలితం మారిపోతుంది. గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా డికాక్ క్యాచ్ మిస్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్ 2026 నుంచి నిష్ర్కమించింది కూడా.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్కో జాన్సెన్ (55 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్(29) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్రలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ లు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్ జట్టు బరిలోకి దిగింది. కివీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను కగిసో రబాడ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ వెనుకగా గాల్లోకి లేచింది. వెంటనే వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్యాచ్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్లాడు. డైవ్ చేసినప్పటికి కూడా అతడు క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డెవాల్డ్ బ్రెవిస్ కు అది చాలా ఈజీ క్యాచ్ అయ్యుండేది. డికాక్ పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బ్రెవిస్ ఆగిపోయాడు. డికాక్ చేసిన ఈ తప్పిదం సౌతాఫ్రికా ఓటమిని శాసించింది.
— Nickk Knight (@KnightNick34590) March 4, 2026
11 పరుగుల వద్ద లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టిమ్ సీఫెర్ట్ (58; 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఫిన్ అలెన్ సెంచరీ (100 నాటౌట్) చేయడంతో 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 12.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఒకవేళ డికాక్ ఆ క్యాచ్‌ను అందుకుని ఉంటే.. లేదంటే బ్రెవిస్ పట్టి ఉంటే.. కివీస్ పై ఒత్తిడి పడేదని, అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పలువురు దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ అంటున్నారు. డికాక్ చేసిన ఈ తప్పు తో తమ జట్టు కప్పుకు దూరం అయిందని కామెంట్లు చేస్తున్నారు.
