T20 World Cup 2026 Sanju Samson comments viral after PLAYER OF THE MATCH against england in semis
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అదరగొట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. భారత జట్టు విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తాను దీనికి అర్హుడని కాదన్నాడు. నిజం చెప్పాలంటే బుమ్రానే దీనికి అర్హుడు అని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (89; 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. శివమ్ దూబె (25 బంతుల్లో 43 పరుగులు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39 పరుగులు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27 పరుగులు), తిలక్ వర్మ (7 బంతుల్లో 21 పరుగులు) లు వేగంగా ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ సాధించాడు.
Arjun Tendulkar Wedding : ఘనంగా అర్జున్ టెండూల్కర్ పెళ్లి..
అనంతరం జాకబ్ బెథెల్ (105; 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీ చేసినప్పటికి మిగిలి వారు విఫలం కావడంతో 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తరువాత సంజూ శాంసన్ మాట్లాడుతూ.. గెలవడం చాలా బాగుందన్నాడు. వాస్తవం చెప్పాలంటే గత మ్యాచ్‌లోనే తాను ఫామ్ అందుకున్నానని అన్నాడు. దానిని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భావించానని చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఆడేటప్పుడు కీలక మ్యాచ్‌ల్లో ఫామ్‌లోకి రావడం అంత తేలిక కాదన్నాడు. ఇది చాలా పెద్ద మ్యాచ్ అని అనుకుంటున్నాను. ‘నేను బ్యాటింగ్ చేస్తున్న విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాను. కాబట్టి తొలుత క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నాను. అన్ని అనుకున్నట్లే జరిగింది. కొంచెం అదృష్టం (బ్రూక్ క్యాచ్ వదిలివేయడం) కూడా కలిసి వచ్చింది.’ అని సంజూ శాంసన్ అన్నాడు.
‘వాంఖడేలో ఆడుతున్నప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎంత భారీ స్కోరు చేసినా కాపాడుకోవడం కష్టం అని తెలుసు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని అనుకున్నాము. 250 పరుగులు కూడా ఛేజ్ చేయొచ్చు అని తెలుసు. ఇక ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. ఆ జట్టు బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇదొక గొప్ప సెమీస్ మ్యాచ్. ‘అని సంజూ తెలిపాడు.
వాంఖడే మైదానంలో మేము ఎన్నో మ్యాచ్‌లు ఆడాము. ఇక్కడి పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం చాలా సులువు. ప్రత్యర్థి టాస్ గెలవడంతో మేము తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అభిషేక్ త్వరగా ఔట్ అయ్యాడు. ఇషాన్‌తో కలిసి ఆడిన తీరు, భాగస్వామ్యం చూసిన తరువాత 250 పరుగులు చేయొచ్చు అని అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా దీని గురించే మాట్లాడుకున్నాము. జట్టుగా రాణించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
ఇక భారత జట్టు గెలిచిందంటే అందుకు పూర్తి కారణం జస్‌ప్రీత్ బుమ్రానే. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. తరానికి ఒక్కడు. అతడు తాను ఏంటో అన్నది మరోసారి చూపించాడు. వాస్తవం చెప్పాలంటే ఈ అవార్డు (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) అతడికే దక్కాలి. డెత్ ఓవర్లలో బుమ్రా అలా బౌలింగ్ చేయకపోతే నేను ఇక్కడ నిలబడి ఉండే వాడిని కాదని అనుకుంటున్నాను. గెలుపు క్రెడిట్ బౌలర్లదే. కఠినమైన పరిస్థితుల్లో వారు గొప్పగా బౌలింగ్ చేశారు.
Sanju Samson said, “this POTM award should’ve been given to Jasprit Bumrah. He’s once in a generational bowler, without his bowling I wouldn’t be here standing”. ❤️🇮🇳 pic.twitter.com/31lrr0cSe2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2026
ఇక వాంఖడేలో ప్రేక్షకుల ప్రోత్సాహం మరువలేనిది. భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లకు మద్దతు ఇచ్చారు. వారు నిజమైన క్రికెట్ అభిమానులు. ఇక్కడ ఆడడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. నేను మైలురాళ్ల గురించి పట్టించుకోను. సెంచరీ చేయడం ముఖ్యమా అంటే నా దృష్టిలో కాదు. టెస్టు, వన్డేల్లో అయితే మీరు కాస్త స్లోగా ఆడుతూ సెంచరీ చేయొచ్చు. కానీ టీ20ల్లో అలా కాదు. బంతిని బలంగా బాదుతూ ఉండాలి. ఆ ప్రక్రియలో సెంచరీ వస్తే ఆనందమే. నాకు సెంచరీ కన్నా మ్యాచ్ గెలవడంలో నా సహకారం ఉందా లేదా అని చూసుకుంటాను. అని సంజూ శాంసన్ అన్నాడు.