T20 world cup 2026 super 8 scenario 5 teams qualified 3 sports remain
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 రేసు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఐదు జట్లు భారత్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. మరో మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లు గా విభజించారు. ఒక్కొ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఇక సూపర్-8కి చేరిన 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూప్‌లు విభజిస్తారు. టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయి.
గ్రూప్-ఏ
భారత్, యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించింది. మిగిలిన ఉన్న ఒక్క స్థానం కోసం యూఎస్ఏ, పాకిస్థాన్ జట్ల మధ్య పోటీ ఉంది. ఇరు జట్లు కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఇప్పటికే యూఎస్ఏ అన్ని మ్యాచ్‌లు ఆడేసింది. పాక్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్ సూపర్-8కి చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం ఇంటి ముఖం పడుతుంది. ఎందుకంటే యూఎస్ఏ రన్‌రేటు పాక్ కంటే మెరుగ్గా ఉంది.
గ్రూప్-బి
శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక జట్టు ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జింబాబ్వే 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌లు ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా జింబాబ్వే సూపర్-8కి అర్హత సాధిస్తుంది.
గ్రూప్-సి
వెస్టిండీస్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు గ్రూప్-సిలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన వెస్టిండీస్, నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఇంగ్లాండ్ జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి.
గ్రూప్-డి
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడాలు గ్రూప్-డిలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించింది. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లు పోటీపడుతున్నాయి. అయితే.. కివీస్ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగు పాయింట్లతో ఉండగా అఫ్గాన్ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. కివీస్ తమ చివరి మ్యాచ్‌లో కెనడా పై గెలిస్తే అప్పుడు న్యూజిలాండ్ సూపర్-8కి అర్హత సాధిస్తుంది.