Team India : చంద్రగ్రహణం ఎఫెక్ట్ టీమ్ఇండియా పై కూడా పడింది..! హార్దిక్ పాండ్యా 2 గంటలకు పైగా..
మంగళవారం (మార్చి3న) చంద్రగ్రహణం కారణంగా భారత (Team India) ప్రాక్టీస్ సెషన్ ఆలస్యమైంది.
T20 World Cup 2026 Team India Postpone Practice Due To Lunar Eclipse Report
- చంద్రగ్రహణం ప్రభావం టీమ్ఇండియాపై కూడా
- దాదాపు గంటన్నర ఆలస్యమైన ప్రాక్టీస్ సెషన్
- రెండు గంటలకు పైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన పాండ్యా
Team India : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ముంబై చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. మంగళవారం (మార్చి3న) చంద్రగ్రహణం కారణంగా భారత ప్రాక్టీస్ సెషన్ ఆలస్యమైంది. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీమ్ఇండియా ప్రాక్టీస్ సెషన్ వాంఖడే మైదానంలో జరగాల్సి ఉంది. అయితే.. రాత్రి 7 గంటల వరకు కూడా భారత ఆటగాళ్లు మైదానానికి చేరుకోలేదు.
మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన చంద్రగ్రహణం 6.47 కి ముగిసింది. కాగా.. గ్రహణ సమయంలో ప్రాక్టీస్ చేయడం అశుభమని ప్లేయర్లు భావించినట్లుగా ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకనే వారు మైదానంలోకి రాలేదని తెలుస్తోంది. గ్రహణం ముగిసిన తరువాతనే భారత ఆటగాళ్లు స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం.
రాత్రి 7.30 గంటలకు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. 10.10 వరకు సెషన్ కొనసాగింది. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు 135 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడడం వరుసగా ఇది మూడోసారి. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్, ఇంగ్లాండ్‌లు తొలిసారి సెమీఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్‌లోనూ గెలిచి కప్పును ముద్దాడింది. కట్ చేస్తే.. టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్లోనూ మరోసారి భారత్, ఇంగ్లాండ్‌లు తలపడ్డాయి. అయితే.. ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ తరువాత ఫైనల్లోనూ గెలిచి కప్పును కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 ప్రపంచకప్ 2026ను ముద్దాడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
