T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం..
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే విజయాన్ని సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- February 13, 2026 / 02:52 PM IST
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (65; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ (31; 32 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. కెప్టెన్ ట్రావిస్ హెడ్ (17) పర్వాలేదనిపించాడు. జోస్ ఇంగ్లిష్ (8), మార్కస్ స్టోయినిస్ (6) లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ లు డకౌట్ అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ నాలుగు వికెట్లు తీశాడు. బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. వెల్లింగ్టన్ మసకద్జా, ర్యాన్ బర్ల్ లు చెరో వికెట్ సాధించారు.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్( 64 నాటౌట్ ; 56 బంతుల్లో 7 ఫోర్లు) అర్థశతకం బాదాడు. మరో ఓపెనర్ తడివానాషే మరుమాని (35; 21 బంతుల్లో 7 ఫోర్లు), వన్ డౌన్ బ్యాటర్ ర్యాన్ బర్ల్ (35; 30 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్ సికిందర్ రజా (19 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.
