T20 World cup final Arshdeep Singh Breaks Silence On Heated Clash With Daryl Mitchell
T20 World Cup Final Arshdeep Singh : టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించి.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆదివారం నాడు ఫైనల్ ఉంటే గెలవదు.. న్యూజిలాండ్ మీద విజయం సాధించలేదు.. టీమిండియాకు అహ్మదాబాద్ స్టేడియం ఏమాత్రం అచ్చిరాదు వంటి నమ్మకాలను.. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ పటాపంచలు చేసింది. న్యూజిలాండ్ మీద భారీ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 రన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీమ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా సాధించిన విజయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో.. మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అంతకు మించిన సంచలనాన్ని క్రియేట్ చేశాయి. వీటిల్లో ముందు వరుసలో ఉంటుంది ఇండియన్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. కివీస్ జట్టు బ్యాటర్ డారిల్ మిచెల్ కు మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. దీనిపై అర్ష్‌దీప్ సింగ్ వివరణ ఇచ్చాడు. అసలు గొడవ ఎందుకు జరిగిందో క్లారిటీ ఇచ్చారు. మ్యాచ్ గెలిచిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ తన త్రో “రివర్స్ స్వింగ్” అయి మిచెల్‌ను తాకడం వల్ల ఈ గొడవ జరిగిందని వెల్లడించాడు. ఓవర్ ముగిసిన తర్వాత తాను మిచెల్ కు క్షమాపణ తెలిపాను అన్నాడు.
అసలేం జరిగిందంటే..
న్యూజిలాండ్ ఛేజ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్ ఆడుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సులు బాదాడు. ఆ తర్వాత వచ్చిన బాల్ ని స్ట్రైట్‌గా కొట్టగా.. అది నేరుగా అర్ష్‌దీప్ చేతికి చిక్కింది. వెంటనే అర్ష్‌దీప్ ఆ బాల్ ని స్టంప్స్ వైపు విసిరాడు. అయితే ఆ త్రో అనుకోకుండా మిచెల్ తొడకు తగిలింది.
బాల్ తాకడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన మిచెల్.. కోపంగా గట్టిగా అరుస్తూ.. అర్ష్‌దీప్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఒకరిని ఒకరు విమర్శించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్, అంపైర్లు కల్పించుకుని శాంతింపజేశారు. అయితే ఆ ఉద్రిక్తత ఎక్కువసేపు కొనసాగలేదు. ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ మిచెల్‌కు క్షమాపణ చెప్పి అతన్ని కౌగిలించుకున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. “అది పెద్ద గొడవేం కాదు. నేను విసిరిన బంతి కొంచెం ఎక్కువగా రివర్స్ స్వింగ్ అయి అతనికి తగిలింది. దీంతో మిచెల్ కు కోపం వచ్చి అరిచాడు. కానీ తర్వాత నేను అతడికి క్షమాపణ చెప్పాను. అది కావాలని చేసింది కాదని.. తాను వేసిన బాల్ రివర్స్ స్వింగ్ అయి తనకు తాకిందని తెలిపాను. అతడు కూడా అర్థం చేసుకున్నాడు. మేం దాని గురించి అప్పుడే మర్చిపోయాం” అన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని, ఆనందంతో తనకు మాటలు రావడం లేదని తెలిపాడు.