IND vs ENG : ఇంగ్లాండ్ పై ఘోర ఓటమి.. భారత్ మూటగట్టుకున్న చెత్త రికార్డులు ఇవే..
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు (IND vs ENG) ఏదీ కలిసి రావడం లేదు.
- Thota Vamshi Kumar
- Published on- July 10, 2026 / 11:32 AM IST
Team india lost match against england in 4t20 unwanted records
IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టులో ఇతడే టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆ తరువాత కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్; 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేదించింది. దీంతో నాలుగో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో పలు అవాంఛనీయ రికార్డును నెలకొల్పింది.
12 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ పై తొలి సిరీస్ ఓటమి..
టీ20ల్లో 12 ఏళ్ల తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌కు సిరీస్‌ను కోల్పోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. కాగా రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న టీ20 సిరీస్‌లో భారత్ పై విజయం సాధించడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి.
BBL : చెన్నైలో బిగ్ బాష్ లీగ్ తొలి మ్యాచ్.. ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్రకటన..
2014లో ఏకైక టీ20 మ్యాచ్ సిరీస్‌లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. అప్పుడు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా, భారత్ 5 వికెట్ల నష్టానికి 177 పరుగులకే పరిమితమైంది.
2018 తరువాత ఏ ఫార్మాట్‌లోనైనా ఇంగ్లాండ్ పై ఇదే తొలి ఓటమి..
2018 నుంచి ఏ ఫార్మాట్‌లోనైనా ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో భారత్ ఓడిపోలేదు. సుమారు 8 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ పై కొనసాగించిన ఆధిపత్యానికి తెరపడింది.
టీ20ల్లో బంతుల పరంగా మూడో అతి పెద్ద ఓటమి..
150 కంటే ఎక్కువ పరుగులు చేసి, ఆ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బంతుల పరంగా భారత్ ఎదుర్కొన్న అతి పెద్ద పరాజయం ఇదే. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో బంతుల పరంగా భారత్‌కు ఇది మూడో అతి పెద్ద ఓటమి. ఇంగ్లాండ్ 37 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌లో విజయం సాధించింది.
