AUS vs ZIM : ‘ఆ ఒక్క తప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా..’ జింబాబ్వేతో ఓటమి పై ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ కామెంట్స్..
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము జింబాబ్వేతో మ్యాచ్‌లో (AUS vs ZIM) ఓడిపోయామని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 13, 2026 / 03:55 PM IST
Travis Head comments after Australia lost match to Zimbabwe in T20 World Cup 2026
- ఆస్ట్రేలియా పై జింబాబ్వే విజయం
- ఆసీస్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ కామెంట్స్
- బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం
AUS vs ZIM : బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓడిపోయామని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో తాము కోలుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్( 64 నాటౌట్ ; 56 బంతుల్లో 7 ఫోర్లు) అర్థశతకం బాదాడు. తడివానాషే మరుమాని (35), ర్యాన్ బర్ల్ (35) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (65; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా గ్లెన్ మాక్స్ వెల్ (31), కెప్టెన్ ట్రావిస్ హెడ్ (17) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ నాలుగు వికెట్లు తీయగా.. బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లు సాధించాడు. వెల్లింగ్టన్ మసకద్జా, ర్యాన్ బర్ల్ లు చెరో వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఆసీస్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ స్పందించాడు. పిచ్‌ను తప్పుగా అంచనా వేశామని చెప్పుకొచ్చాడు. తాము బౌలింగ్‌లో రెండే వికెట్లు తీయడంతో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చునని భావించామని అన్నాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారినట్లుగా అనిపించిందన్నాడు. వాస్తవం చెప్పాలంటే పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందన్నాడు.
ఆ తరువాత తాము కోలుకోలేకపోయామన్నాడు. సాధించాల్సిన రన్‌రేట్ సైతం పెరిగిపోవడంతో తమ బ్యాటర్లు తప్పులు చేశారన్నాడు. మధ్యలో ఓ మంచి భాగస్వామ్యం (గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్షా) నమోదైనప్పటికి దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. ఓడిపోవడం నిరాశ కలిగించిందన్నాడు. అయితే.. క్రికెట్‌లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని, అదే ఆట అని చెప్పుకొచ్చాడు. జింబాబ్వే ఆటగాళ్లు గొప్పగా ఆడారని, విజయానికి వారు అర్హులు అని తెలిపాడు.
ఇక తమ జట్టులో కొంత మంది కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని, వారు కోలుకుని జట్టులో చేరితే తమకు తిరుగు ఉండదని తెలిపాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తామని హెడ్ తెలిపాడు.
