Vaibhav Sooryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లీ, రోహిత్ శర్మలకు సాధ్యం కానీ రికార్డు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi )అరుదైన ఘనత సాధించాడు.
Vaibhav Sooryavanshi creates history became fastest player to reach 400 runs in single ipl edition (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్లో 400 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ
- ఈ సీజన్లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ప్లేయర్ ఇతడే
- ఇక ఓవరాల్‌గా ఓ సీజన్లో అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర
Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 400 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. మంగవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ ఘనతను సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అతడు ఆండ్రీ రస్సెల్ ను అధిగమించాడు. 2019 ఐపీఎల్ సీజన్లో రస్సెల్ 188 బంతుల్లోనే 400 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తాజాగా వైభవ్ అతడి కంటే 21 బంతులు తక్కువగానే అంటే 167 బంతుల్లో 400 రన్స్ సాధించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో వైభవ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.
ఓ ఐపీఎల్ సీజన్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ – 167 బంతులు (2026 ఐపీఎల్లో)
* ఆండ్రీ రస్సెల్ – 188 బంతులు (2019 ఐపీఎల్లో)
* అభిషేక్ శర్మ – 195 బంతులు (2024 ఐపీఎల్లో)
* నికోలస్ పూరన్ – 197 బంతులు (2025 ఐపీఎల్లో)
* గ్లెన్ మాక్స్వెల్ – 200 బంతులు (2014 ఐపీఎల్లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్ (62 నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59) లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆర్ఆర్ బౌలర్లలో యశ్ రాజ్ పుంజా రెండు, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత డోనోవన్ ఫెరీరా (52 నాటౌట్ ), యశస్వి జైస్వాల్ (51) రాణించడంతో 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో చహల్ మూడు, అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు.
