ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపుకు నోచుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పై విజయం సాధించింది. ఎట్టకేలకు గెలుపు అందుకున్నామనే ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీకి మరో షాక్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్యం.
మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైందని.. హెచ్చరిస్తూ రూ.12లక్షల జరిమానా విధించింది. కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కోహ్లీ ఖాతా నుంచే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇలా మొదటి సారి కావడంతో కేవలం రూ.12లక్షల జరిమానాతో సరిపెట్టుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. పార్థివ్ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ(53)పరుగులు చేయగా.. డివిలియర్స్(59), స్టోనిస్(28)పరుగులు చేసి విజయాన్ని రాబట్టారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ క్రమంలో తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 15 సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.