Lucknow Super Giants : ఐపీఎల్ రూల్స్ దెబ్బ కొట్టాయా? ఐదు వికెట్లు తీసిన బౌలర్‌తో సూపర్ ఓవర్‌ను వేయించని లక్నో.. షాకింగ్ రీజన్
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పై (Lucknow Super Giants) కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయాన్ని అందుకుంది.
Why LSG Couldnt Use Their Best Bowler In Super Over vs KKR in IPL 2026 (pic credit@ipl)
- ఐదు వికెట్లతో చెలరేగిన లక్నో పేసర్ మోసిన్ ఖాన్
- అయినా గానీ సూపర్ ఓవర్లో అతడితో బౌలింగ్ చేయించని లక్నో
- ఐపీఎల్ రూల్స్ దెబ్బ కొట్టాయా?
Lucknow Super Giants : ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ బ్యాటింగ్‌లో 83 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా ఫీల్డింగ్‌లో 5 క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రింకూ సింగ్ (83 నాటౌట్; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరూన్ గ్రీన్ (34; 21 బంతుల్లో 3 సిక్సర్లు) రాణించాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ ఐదు వికెట్లు తీశాడు. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత రిషబ్ పంత్ (38 బంతుల్లో 42 పరుగులు), ఐడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 31 పరుగులు ), ఆయుష్ బదోని (19 బంతుల్లో 24 పరుగులు) రాణించగా లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి సరిగ్గా 155 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి లు చెరో రెండు వికెట్లు తీశారు. అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, కార్తిక్ త్యాగిలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఇక సూపర్ ఓవర్లో స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి లక్నో జట్టు 1 పరుగు మాత్రమే చేసింది. ఇక లక్నో బౌలర్ ప్రిన్సీ యాదవ్ బౌలింగ్‌లో తొలి బంతికే ఫోర్ కొట్టిన రింకూ సింగ్ కేకేఆర్ కు విజయాన్ని అందించాడు.
5 వికెట్లు తీసిన మోసిన్ ఖాన్ ను కాదని..
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి మంచి జోష్‌లో ఉన్న మోసిన్ ఖాన్‌ను కాదని లక్నో జట్టు ప్రిన్సీ యాదవ్‌తో సూపర్ ఓవర్ వేయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఐపీఎల్ నిబంధననే కారణం.
ఎందుకంటే బౌలింగ్ కోటా ముగిసిన తరువాత మోసిన్ ఖాన్ స్థానంలో కామోరూన్ గ్రీన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. దీంతో మ్యాచ్‌లో మోసిన్ ఖాన్ ప్రయాణం అంతటితో ముగిసింది.కాబట్టి అతడు సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు అర్హుడు కాదు.
