ENG vs PAK : పాకిస్థాన్ పై ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ఇంగ్లాండ్
England vs Pakistan : వన్డే ప్రపంచకప్‌లో 2023లో దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 11, 2023 / 09:45 PM IST
England (pic @ani)
వన్డే ప్రపంచకప్‌లో 2023లో దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో పాకిస్థాన్ పై విజయం సాధించడం ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫై అయ్యింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ప్రపంచకప్‌లో 2023లో లీగ్ దశలో టాప్-7 స్థానాల్లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయి.
పాక్ పై విజయంతో పట్టికలో ఇంగ్లాండ్ ఏడో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. భారత్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించినప్పటికీ ఇంగ్లాండ్ స్థానానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు.
New Zealand : వరుసగా ఐదోసారి ప్రపంచకప్ సెమీస్‌కు న్యూజిలాండ్.. మరి ఈసారైనా..!
338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఆగా సల్మాన్ (51; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. బాబర్ ఆజామ్ (38), రిజ్వాన్ (36) లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన వారు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో బెన్‌స్టోక్స్ (84; 76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), జో రూట్ (60; 72 బంతుల్లో 4 ఫోర్లు), బెయిర్ స్టో(59; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మలన్ (31), హ్యారీ బ్రూక్ (30) లు రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు. మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇఫ్తికార్ అహ్మద్ ఓ వికెట్ సాధించాడు.
