Lightning Strike Phone : పిడుగుపాటుకు ఫోన్లు పేలతాయా? పిడుగుల సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..
Lightning Strike Phone Tips: పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా? దీనిపై చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం..
- Harish Thanniru
- Updated on- September 21, 2026 / 02:49 PM IST
can you use mobile phone during thunderstorm lightning safety tips
Lightning Strike Phone : పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా? దీనిపై చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం సాధారణంగా సురక్షితమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉపయోగించడం మాత్రం ప్రమాదకరం. మొబైల్ ఫోన్లు పిడుగులను ఆకర్షిస్తాయనేది ఒక అపోహ మాత్రమే. రేడియో తరంగాలు పవర్‌ను ప్రసారం చేయవు. అదేవిధంగా మొబైల్ ఫోన్లలో ఉండే లోహం పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Also Read : గోదావరిఖనిలో యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్! ఫోన్లో లేఖ.. కారులో మందు.. పక్కా ప్లాన్‌తో..
పిడుగు భూమికి చేరేందుకు తక్కువ నిరోధం ఉన్న మార్గాన్ని అనుసరిస్తుంది. ముఖ్యంగా విద్యుత్ తీగలు, నీటి పైపులు, ఇంట్లోని లోహ నిర్మాణాల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. పిడుగు విద్యుత్ గ్రిడ్‌ను తాకినప్పుడు భారీ వోల్టేజ్ విద్యుత్ వ్యవస్థ ద్వారా ప్రయాణించి, ఛార్జింగ్ కేబుల్ వంటి వైర్ల ద్వారా మనిషికి చేరే ప్రమాదం ఉంది. అందుకే వైర్‌తో అనుసంధానమైన ల్యాండ్‌లైన్ ఫోన్లను ఉరుములతో కూడిన వర్షం సమయంలో ఉపయోగించకూడదు.
మొబైల్ ఫోన్ వైర్‌లెస్‌గా పనిచేస్తుంది కాబట్టి విద్యుత్ గ్రిడ్‌తో ప్రత్యక్ష అనుసంధానం ఉండదు. అందువల్ల ఛార్జింగ్ పెట్టని మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం సురక్షితమే. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఉపయోగించడం మాత్రం చాలా డేంజర్. అదేవిధంగా నీరు, లోహాలు విద్యుత్‌ను సులభంగా ప్రసారం చేస్తాయి. కాబట్టి పిడుగులు పడుతున్న సమయంలో స్నానం చేయడం, పాత్రలు కడగడం, వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతకడం వంటి పనులు చేయకపోవడం ఉత్తమం.
ఇంటి గోడలు, నేలల్లో కూడా లోహం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాల్లో ఇనుప రాడ్లు ఉంటాయి. అందువల్ల పిడుగులు పడుతున్న సమయంలో కాంక్రీట్ గోడలకు ఆనుకుని నిలబడటం లేదా కాంక్రీట్ నేలపై పడుకోవడం నివారించాలి. బయట ఉన్న సమయంలో మొబైల్ ఫోన్ పిడుగులను ఆకర్షించదు. అయితే పిడుగులతో కూడిన వర్షాన్ని వీడియో తీయడానికి ప్రయత్నించడం ప్రమాదకరం. వీడియో తీస్తూ ఉండటం వల్ల ప్రమాదాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి చేరుకునే సమయం ఆలస్యం కావచ్చు.
పిడుగుల సమయంలో వీలైనంత త్వరగా పూర్తిగా మూసివున్న భవనంలోకి లేదా లోహపు పైకప్పు ఉన్న కారులోకి వెళ్లాలి. ఇవి ఫారడే కేజ్ (విద్యుత్ ప్రసారాన్ని లోపలికి రాకుండా అడ్డుకునే ఒక వాహక ఆవరణ) ప్రభావం కారణంగా కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే టెంట్లు, చెట్ల కింద నిలబడటం సురక్షితం కాదు.
పిడుగుల సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
♦ వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం సాధారణంగా సురక్షితం.
♦ ఛార్జింగ్ పెట్టి ఉంచిన సమయంలో ఫోన్ లేదా ఇతర పరికరాలను ఉఫయోగించడం ప్రమాదకరం.
♦ విద్యుత్ గ్రిడ్‌కు వైర్ ద్వారా అనుసంధానమైన పరికరాలకు దూరంగా ఉండండి.
♦ ఉరుములతో కూడిన వర్షం సమయంలో స్నానం, పాత్రలు కడగడం వంటి పనులు చేయకండి.
♦ చెట్లు, టెంట్ల కింద ఆశ్రయం పొందకండి.
♦ వీలైనంత త్వరగా మూసివున్న భవనం లేదంటే లోహపు పైకప్పు ఉన్న కారులోకి వెళ్లండి.
♦ ల్యాప్‌టాప్ వంటి పరికరాలను ఛార్జింగ్‌కు పెట్టకుండా ఉపయోగించడం సురక్షితమైనప్పటికీ, వీలైతే వాటిని విద్యుత్ కనెక్షన్ నుంచి పూర్తిగా వేరు చేయడం మంచిది.
♦ పిడుగు తగిలిన వ్యక్తి శరీరంలో విద్యుత్ నిల్వ ఉండదు. కాబట్టి అతడిని తాకి సహాయం చేయడం సురక్షితమే.
♦ ఎవరైనా పిడుగు బారినపడితే వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించి, అవసరమైతే CPR (సీపీఆర్) చేయాలి.
♦ తుఫాను వచ్చే ముందు ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవడం, విద్యుత్ పరికరాలను ప్లగ్ నుంచి తొలగించడం మంచిది.
