ఈ బ్యాంకు అకౌంట్లలో PhonePe పనిచేయదు

  • Publish Date - April 28, 2020 / 09:31 AM IST

మీరు ఫోన్‌పే కస్టమర్లా? ఇకపై మీ ఫోన్ పే అకౌంట్ పనిచేయదు. ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు ఆర్థిక సంక్షోభం, ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే #PhonePe సేవలకు అంతరాయం ఏర్పడింది. యస్‌ బ్యాంకు అకౌంట్‌దారుల్లో, ఫోన్‌‌పే యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంకుపై నెల రోజులపాటు  ఆర్బీఐ మారటోరియం విధించింది.

యస్ బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బుల కోసం ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. RBI కఠిన నియంత్రణల నేపథ్యంలో యస్ బ్యాంక్ కస్టమర్లు కేవలం నెలకు రూ.50,000 వరకు మాత్రమే అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. తాత్కాలిక నిషేధ నిబంధనల ప్రకారం కరెంట్‌ అకౌంట్లతో పాటు అకౌంట్ దారులంతా ఏప్రిల్‌ 3 దాకా రూ. 50 వేలకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. 

ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే మీకు కూడా ఈ పరిమితి వర్తిస్తుందని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. దీనిపై ఫోన్‌ పే వ్యవస్థాపకుడు సమీర్‌ నిగమ్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ట్వీట్‌ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు.

తమ బ్యాంకింగ్‌ భాగస్వామి యస్‌ బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో #Phonpe సేవలు ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు.