iPhone Rare Models
iPhone Rare Models : ఆపిల్ లవర్స్ మీకు ఇది తెలుసా? ఐఫోన్ అంటేనే కెమెరా ఫీచర్లు.. అలాంటి ఐఫోన్లలో కెమెరా లేని ఐఫోన్లు కూడా ఉంటాయని మీకు తెలుసా? మీరు అనుకున్నట్టుగా మనం అందరం వాడే ఐఫోన్ల మాదిరిగా ఉంటాయా? అంటే అవును అలాగే ఉంటాయి. కానీ, మార్కెట్లో దొరికే ఐఫోన్ల కన్నా కెమెరా లేని ఐఫోన్లకే ఫుల్ డిమాండ్.. ధర కూడా చాలా ఖరీదు ఉంటుంది. సాధారణంగా కెమెరాలను బట్టి ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు..
వాస్తవానికి, చాలామంది ఐఫోన్‌లను (iPhone Rare Models) కెమెరా క్వాలిటీ కోసమే కొనుగోలు చేస్తారు. కెమెరాలు లేని ఐఫోన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్‌లు సాధారణ ఐఫోన్‌ల కన్నా చాలా ఖరీదైనవి కూడా. ఈ ఐఫోన్‌ల బ్యాక్ సైడ్ మీరు కెమెరా లెన్స్‌ను చూడలేరు. పూర్తిగా ఖాళీగా ఉంటాయి. ఇంతకీ కెమెరా లేని ఐఫోన్లను ఎవరు తయారు చేస్తారు? ఎందుకు తయారుచేస్తారు? ఎక్కడ వాడతారు? ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగిస్తారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కెమెరాలు లేని ఐఫోన్‌లు ఎందుకంటే? :
కెమెరాలు లేని ఐఫోన్‌లను సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కెమెరాలు నిషేధిత ప్రదేశాలలో వాడేందుకు తయారుచేస్తుంటారు. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలు, ల్యాబరేటరీలు, షిప్‌యార్డులు వంటి కొన్ని ప్రదేశాలలో అలాంటి ఐఫోన్‌లు వినియోగిస్తారు. పెటాపిక్సెల్ రిపోర్టుల ప్రకారం.. అణు కర్మాగారంలో పనిచేసే దగ్గర కెమెరా ఫోన్లు నిషిద్ధం. అందుకే ఆ స్థలంలో పనిచేసే వ్యక్తులకు కెమెరాలు లేని అలాంటి ఐఫోన్‌లను ఇస్తుంటారు.
నివేదిక ప్రకారం.. ఈ కెమెరా లేని ఐఫోన్‌లు స్టాండర్డ్ ఐఫోన్‌ల కన్నా అత్యంత ఖరీదైనవి. ఈ ఐఫోన్‌లను నాన్‌క్యామ్ సంస్థ విక్రయిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఐఫోన్ SE (2020), ఐఫోన్ SE (2022) వంటి కెమెరా లేని ఐఫోన్ మోడల్‌లు 1,130 డాలర్ల నుంచి 1,680 డాలర్ల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ ఐఫోన్ మోడళ్ల వాస్తవ ధర కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. వాస్తవానికి, కెమెరాలు లేని ఐఫోన్‌లు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఎక్కువగా అవసరం ఉంటుంది. అక్కడ ఆ ఐఫోన్లు లేకుండా ఏ పని చేయడం అసాధ్యమే. అందుకే ఈ కంపెనీలు అలాంటి ఐఫోన్‌ల కోసం ఎక్కువ చెల్లించేందుకు రెడీగా ఉంటాయి.
ఆపిల్ కంపెనీ ఈ ఐఫోన్‌లు తయారుచేస్తుందా? :
వాస్తవానికి, ఈ కెమెరా లేని ఐఫోన్‌లను ఆపిల్ తయారు చేయదు. నాన్‌క్యామ్, మిస్టర్ మొబైల్‌తో సహా థర్డ్-పార్టీ కంపెనీలు ఈ ఐఫోన్‌లను తయారు చేస్తాయి. కెమెరా లేని ఐఫోన్‌లను వారి స్పెషల్ క్లయింట్‌లకు అధిక ధరలకు విక్రయిస్తారు. కెమెరా లేని ఐఫోన్‌లను తయారుచేసేందుకు వారు ఇప్పటికే ఉన్న ఐఫోన్‌ల నుంచి కెమెరా మాడ్యూల్‌ను తొలగిస్తారు అంతే.. అయితే, ఈ కెమెరాల తొలగింపు అనేది చాలా కచ్చితత్వంతో చేస్తారు. చూసేందుకు అచ్చం ఆపిల్ స్వయంగా తయారుచేసినట్టుగానే కనిపిస్తాయి.