BAT-BMS App Controversy : ఒక్క ట్యాప్‌తో ఈ-రిక్షా బంద్..! BAT-BMS యాప్ ఏంటి? ప్రభుత్వం బ్యాన్ చేయడానికి కారణం ఇదే!

BAT-BMS App Controversy : రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న ఈ-రిక్షా సడెన్ గా ఆగిపోతోంది. ఏం జరుగుతుందో తెలియక డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణంగా బ్యాట్-బీఎంఎస్ అనే యాప్ అని తేలడంతో ప్రభుత్వం ఈ యాప్ వెంటనే బ్యాన్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

BAT-BMS App Controversy

  • BAT-BMS యాప్‌తో కొత్త ముప్పు.. ప్రభుత్వం రంగంలోకి!
  • ఈ యాప్ మీ ఈ-రిక్షాను ఆపేస్తుందా? అసలు నిజం ఇదే!
  • ప్రయాణికుల భద్రతపై పెరిగిన ఆందోళన, యాప్‌ బ్యాన్

BAT-BMS App Controversy : ఒక్క మొబైల్.. ఒక్క యాప్.. ఒక్క ట్యాప్.. అంతే! రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఈ-రిక్షా ఒక్కసారిగా ఆగిపోతుంది. డ్రైవర్‌కు ఏం జరిగిందో అర్థం కాదు. ఇంజిన్‌లో చూస్తే సమస్య లేదు.. బ్యాటరీ కూడా బాగానే ఉంది.. అయినా వెహికల్ ముందుకు కదలనే కదలదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల వెనుక ఉన్న యాప్ ఇదంతా చేస్తుంది. అదే..
BAT-BMS యాప్.. ఈ అప్లికేషన్ కారణంగా దేశవ్యాప్తంగా భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది.

బ్యాట్-బీఎంఎస్ యాప్ ఏంటి? :
ఈ (BAT-BMS) అనేది చైనాకు చెందిన (Shenzhen Grenergy Technology) సంస్థ రూపొందించిన మొబైల్ అప్లికేషన్. ఈ-రిక్షాల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీల పర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేసేందుకు ఈ యాప్ డిజైన్ చేశారు. బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉంది? వోల్టేజ్ ఎంత? టెంపరేచర్ ఎలా ఉంది? ఎన్ని సార్లు ఛార్జ్ అయింది?

బ్యాటరీ సెల్ హెల్త్ ఎలా ఉంది? అనే పూర్తి వివరాలను బ్లూటూత్ 5.0 ద్వారా సుమారు 15 మీటర్ల దూరంలో నుంచే మొబైల్‌లో చెక్ చేయొచ్చు. సాధారణంగా ఈ యాప్‌ను ఈ-రిక్షా యజమానులు, బ్యాటరీ టెక్నీషియన్లు బ్యాటరీని ఓపెన్ చేయకుండానే దాని పర్ఫార్మెన్స్ చెక్ చేసేందుకు వాడుతుంటారు.

వివాదం ఎలా మొదలైందంటే? :
అసలు సమస్య యాప్‌లో కాదు.. సేఫ్టీ సిస్టమ్ లేని చౌక లిథియం బ్యాటరీల్లోనే ఉంది. చాలావరకూ కొన్ని బ్యాటరీల్లో బ్లూటూత్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. ఎలాంటి పాస్‌వర్డ్ కూడా ఉండదు. ఎవరైనా BAT-BMS లేదా ఇలాంటి యాప్‌లతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు.

Read Also : Amazon Prime Day 2026 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

కనెక్ట్ అయ్యాక యాప్‌లోని ‘Discharge Switch’ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే చాలు.. బ్యాటరీ నుంచి పవర్ సప్లయ్ వెంటనే నిలిచిపోతుంది. దాంతో ఈ-రిక్షా రోడ్డుపైనే ఆగిపోతుంది. డ్రైవర్ తాళంతో స్టార్ట్ చేయాలన్నా కుదరదు. మళ్లీ అదే యాప్ ద్వారా పవర్ ఆన్ చేశాకే వాహనం స్టార్ట్ అవుతుంది.

ప్రాంక్ నుంచి నేరాలకు.. :
ముందుగా సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం కొందరు ఈ ఫీచర్‌ను ప్రాంక్‌గా వాడారు. కానీ, ఆ తర్వాతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొందరు ఈ-రిక్షాలను రిమోట్‌గా ఆపేసి మళ్లీ ఆన్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డ్రైవర్లను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలతో డ్రైవర్ల భద్రత, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

రంగంలోకి దిగిన ప్రభుత్వం :
సోషల్ మీడియాలో ఈ యాప్ గురించే తెగ చర్చ నడుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ యాప్ వివాదంపై విచారణ ప్రారంభించింది. రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ మాట్లాడుతూ.. ఇలా వాహనాలను రిమోట్‌గా ఆపడం పూర్తిగా చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారు.

మరోవైపు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ యాప్ దుర్వినియోగంపై విచారణ చేపట్టింది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని BAT-BMS యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా యాప్ తొలగించారు.

ఆటోరిక్షా డ్రైవర్లు ఏం చేయాలి? :
నిపుణుల ప్రకారం.. బ్లూటూత్‌కు డిఫాల్ట్ పాస్‌వర్డ్ ఉంటే వెంటనే మార్చుకోవడం బెటర్. బ్యాటరీలో యాప్ లాక్, రిమోట్ కంట్రోల్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటే తప్పనిసరిగా ఆన్ చేయాలి. బ్లూటూత్ అవసరం లేకుంటే అధికారిక టెక్నీషియన్‌తో పూర్తిగా డిసేబుల్ చేయించడం బెటర్. ఇలా చేస్తే.. ఎలాంటి అనధికార వ్యక్తి బ్యాటరీకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. చిన్న భద్రతా లోపం కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో బ్యాట్ బీఎంఎస్ వివాదంతో మరోసారి స్పష్టమైంది.