16th Finance Commission TG: సర్పంచులకు అదిరిపోయే శుభవార్త.. రూ.9,968 కోట్ల నిధులు విడుదల
16th Finance Commission: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 05:04 PM IST
16th Finance Commission Allocated Rs 9968 Crore Funds For Telangana Rural Developmen
Central Funds Telangana : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం.. తాజాగా భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. ఈ క్రమంలో ఐదేళ్లకు గాను అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. అయితే ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వీటిని కచ్చితంగా పాటించాలని పేర్కొంది.
కేంద్రం కేటాయించిన ఈ రూ.9,968 కోట్ల నిధులను కేవలం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్‌ల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిధులతో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారులు, స్ట్రీట్ లైట్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాత్రమే ఈ నిధులను వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు వాడకూడదని కేంద్రం స్పష్టం చేసింది.
*మహిళలకు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. నెలకు లక్షల్లో సంపాదించుకునే అవకాశం..
తెలంగాణలోని స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేటాయించిన ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం..
- ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు గ్రామంలో అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
- ఏడాదిలో నిధులు దేనికి ఖర్చు చేశారో.. వాటి ద్వారా జరిగిన అభివృద్ధి ఏమిటి అనే దానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలి.
- రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది.
- ఆడిట్‌లో లోపాలు, నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని.. ఈ మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు రానున్న ఐదేళ్ల సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక సంఘం రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. ఈ మొత్తంలో 80 శాతం నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించగా, మిగిలిన 20 శాతం నిధుల్లో 10 శాతం మొత్తాన్ని మండల పరిషత్‌లకు, మరో 10 శాతాన్ని జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.
