Bandi Sanjay-Eatala Rajender: మా మధ్య విభేదాలు లేవు.. బండి, ఈటల మధ్య కుదిరిన సయోధ్య.. అధికారమే లక్ష్యంగా..
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్(Bandi Sanjay-Eatala Rajender) మధ్య పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ సయోధ్య కుదిర్చారు.
Bjp RESOLVES DIFFERENCES BETWEEN BANDI SANJAY AND EATALA RAJENDER
- బండి, ఈటల మధ్య రాజీ.
- కలిసికట్టుగా బీజేపీ అధికారమే లక్ష్యం.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్.
Bandi Sanjay-Eatala Rajender: తెలంగాణలో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి, నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్(Bandi Sanjay-Eatala Rajender) మధ్య పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ సయోధ్య కుదిర్చారు.
ఎంపీ లక్ష్మణ్ నివాసంలో భేటీ:
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా శనివారం ఈ కీలక సమావేశం జరిగింది. అభయ్ పాటిల్ సమక్షంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ముఖాముఖి చర్చలు జరిపారు. పాత విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. అనంతరం నేతలు మీడియా ముందుకు వచ్చి, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్:
ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీల పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సరిగ్గా నెరవేర్చలేదని, వారి వైఖరితో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
