Heat Wave Alert : బిగ్ అలర్ట్.. అప్పుడే హడలెత్తిస్తున్న ఎండలు.. ఏప్రిల్, మేలో చుక్కలే.. ఈ జిల్లాల్లో అధికం.. వాతావరణశాఖ సంచలన విషయాలు
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.. ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
- Harishth Thanniru
- Published On : March 4, 2026 / 07:05 AM IST
Heat Wave Alert
- తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల తీవ్రత
- సాధారణం కన్నా ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు
- 21 జిల్లాల్లో 37డిగ్రీలు దాటేసిన టెంపరేచర్లు
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.. ప్రస్తుతం ఎండలు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజుల్లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరువయ్యాయి. మరో రెండుమూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read : CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. సంక్షేమ పథకాలపై కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని మార్చి ప్రారంభంలోనే చూపిస్తోంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ, ఈసారి మార్చి నెలలోనే 11గంటల నుంచి భానుడు హడలెత్తిస్తున్నాడు. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావాలంటే భయడుతున్న పరిస్థితి నెలకొంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, తెలంగాణలో రెండు, మూడు రోజులుగా ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. సాధారణం కన్నా ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మంగళవారం తెలంగాణలో 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37డిగ్రీలకుపైగా నమోదవగా.. ఒక్క హైదరాబాద్ లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో 37.4 డిగ్రీలమేర గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏప్రిల్, మేలో హడలే..
దేశవ్యాప్తంగా ఈసారి మార్చి నెల నుంచి మే వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్, మే నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా మార్చి నుంచి మే వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గతం ఏడాది 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారికూడా అదే స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత, వేడి గాలులతోపాటు ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
