Pawan Kalyan : అభిమాని నిరంజన్‌ను కలిసి ఆప్యాయంగా పలుకరించిన పవన్ కళ్యాణ్.. సెల్ఫీలు దిగి.. బాలుడితో ముచ్చటించిన జనసేనాని

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ (17)ను పరామర్శించారు.

ap deputy cm pawan Kalyan meets ailing fan niranjan in Hanamkonda

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడి కోరిక మేరకు పవన్ బుధవారం బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని అభిమానం. దీంతో హీరో పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని కోరాడు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ హన్మకొండలోని హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

నిరంజన్‌ను ఆప్యాయంగా పలుకరించిన పవన్.. బాలుడి తలను నిమురుతూ ధైర్యం చెప్పారు. బాలుడి చేతిని అందుకొని ముద్దాడారు. అనంతరం బాలుడితోపాటు అతని కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగారు. కొద్దిసేపు బాలుడితోపాటు అతని కుటుంబ సభ్యులతో పవన్ ముచ్చటించారు. నిరంజన్ ఆరోగ్య ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలను ఇచ్చిన పవన్.. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి గుడిలో పూజలు చేస్తానని పవన్ చెప్పారు.కాగా.. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది. వారికి పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.