Telangana SIR : ఏపీలో ఓటుంటే ఇక్కడ SIRలో పేరు నమోదు చేసుకోవచ్చా?
Telangana SIR : సర్ అంటే పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఓటర్లు వలస వెళ్లడం, మృతి చెందిన వారి పేర్లను తొలగించకపోవటం, మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరిపి అనర్హులను తొలగించి అర్హులను జాబితాలో చేర్చే ప్రక్రియనే సర్ అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
- Harish Thanniru
- Published on- June 27, 2026 / 10:37 PM IST
Telangana SIR
Telangana SIR: దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-సర్) ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోకూడా సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే, ఈ సర్‌కి సంబంధించి అనేక సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు సర్ అంటే ఏమిటి? ఎన్యుమరేటర్ ఇంటికి వస్తారా.. అసలు మన పేరు ఏ విధంగా నమోదు చేసుకోవాలి..? ఎలాంటి పత్రాలు ఇవ్వాలనే అంశాలపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి.
సర్ అంటే పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఓటర్లు వలస వెళ్లడం, మృతి చెందిన వారి పేర్లను తొలగించకపోవటం, మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరిపి అనర్హులను తొలగించి అర్హులను జాబితాలో చేర్చే ప్రక్రియనే సర్ అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
బీఎల్‌వో ఇంటికి వస్తారా..? రాకపోతే ఏం చేయాలి..?
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఆ ఫారాలను ఎలా నింపాలో వారు వివరంగా చెబుతారు. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఫారాలను నింపిన తరువాత ఒకటి వారు తీసుకొని.. రెండో ఫారాన్ని రశీదుగా మనకు అందజేస్తారు. ఒకవేళ బీఎల్వోలు ఇంటికి వచ్చిన సమయంలో ఓటరు లేకపోతే కుటుంబంలో మేజర్ అయిన సభ్యుడికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఆ సభ్యుడి ద్వారా కూడా నింపిన ఫారాలను బీఎల్వోకు అందించొచ్చు. ఒకవేళ బీఎల్‌వో ఇంటికి రాకపోతే సంబంధిత బీఎల్‌వో ఫోన్ నంబర్‌ను రాష్ట్ర ఎన్నికల శాఖ వెబ్‌సైట్ లేదా ECI యాప్ ద్వారా తెలుసుకుని సంప్రదించవచ్చు. అలాగే ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ 1950కు కాల్ చేసి కూడా సమాచారం పొందే అవకాశం ఉంది. అవసరమైతే బీఎల్‌వోను మళ్లీ ఇంటికి వచ్చేలా కోరవచ్చు.
ఫారంలో తప్పులు ఉంటే ఎలా సరిచేయాలి?
ఎన్యుమరేషన్ ఫారంలో పొరపాట్లు జరిగినట్లయితే అదే ఫారంలో సవరణలు చేసి బీఎల్‌వోకు అందజేయవచ్చు. వివరాలు సరిచేసిన తర్వాత వాటిని ఎన్నికల అధికారులు పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తారు.
ఏపీలో ఓటు.. ఉద్యోగం హైదరాబాద్‌లో.. ఏం చేయాలి?
ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ, స్వగ్రామంలో ఓటు ఉన్నవారికి కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తికి ఒకేచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేయడం చట్ట విరుద్ధం. ఉదాహరణకు.. ఏపీలో నివాసం ఉండి ఉద్యోగ రిత్యా హైదరాబాద్ లో ఉంటున్నవారు.. ఒకవేళ హైదరాబాద్‌లో ఓటు నమోదు చేసుకోవాలంటే.. ముందుగా ఏపీలో ఓటును రద్దు చేసుకోవాలి.. అనంతరం తెలంగాణలో ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఫారం-6 లేదా అవసరమైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. అదే ఇప్పటికే తెలంగాణలో ఓటు ఉండి చిరునామా మాత్రమే మారితే ఫారం-8 ద్వారా అడ్రస్ మార్పు చేసుకోవాలి. ఏపీలో ఓటరుగా ఉండి.. ఇక్కడ సర్ లో పేరు నమోదు చేసుకోవటానికి వీలుండదు. అదేవిధంగా కుటుంబంలోని ఒక ఓటరు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యుమరేషన్ పత్రాన్ని ఆ కుటుంబ పెద్దకు అందిస్తారు. ఓటరు తరపున ఆ ఇంటి పెద్ద ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి సంతకం చేసి బీఎల్వోకు అందించాలి. ఒకవేళ ఓటరు విదేశాల్లో ఉంటే.. ఆ వ్యక్తి వివరాలు ఆ కుటుంబం పెద్ద ఎన్యూమరేషన్ ఫామ్ లో నింపి సంతకం చేయొచ్చు. లేకపోతే విదేశాల్లో ఉన్న అర్హులైన ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా ఫామ్ నింపొచ్చు. అప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.
ఆధార్ కార్డు తప్పనిసరా?
SIR ప్రక్రియలో ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ నమోదు చేయడం ఐచ్ఛికం మాత్రమే. ఆధార్ లేకపోయినా ఓటరు నమోదు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండదు.
