Balapur Laddu History : బాలాపూర్ గణేశ్ లడ్డూ ఎందుకంత ఫేమస్.. ప్రత్యేకతలు ఇవే.. ఈసారి సరికొత్త రికార్డు నమోదవుతుందా? గతంలో ఇలా..

Balapur Laddu History : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ స్వామివారికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది.

Balapur Ganesh

Balapur Laddu History : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్​కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ స్వామివారికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఘన చరిత్ర కలిగిన బాలాపూర్ వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు.

Also Read : Telangana Politics : తెలంగాణలో పవర్‌ కట్‌పై పొలిటికల్‌ ఫైట్‌.. బొగ్గు లెక్కలతో బీఆర్ఎస్‌కు ప్రభుత్వ కౌంటర్‌.. అసలు కథేంటి?

బాలాపూర్‌లో పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనం ఇవాళ జరగనుంది. ఉదయం 5గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 7గంటలకు వినాయకుడిని వాహనంలోకి ఎక్కించి శోభాయాత్రను ప్రారంభించారు. 9గంటలకు గ్రామ బొడ్రాయి వద్దకు బొజ్జ గణపయ్య చేరుకుంటారు. అక్కడ 9.30గంటలకు వేలం పాట నిర్వహిస్తారు. అనంతరం పెద్ద వాహనంపైకి వినాయకుడిని తరలించి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలిస్తారు. సాయంత్రం సమయంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుంది.

అందరిచూపు లడ్డూ వేలం వైపు..
బాలాపూర్ గణపయ్య వద్ద ఉంచే లడ్డూ ఎంతో ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది వేలంపాటలో ఈ లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడతారు. తొమ్మిది రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో పూజలందుకునే స్వామివారి చేతిలోని 21 కేజీల లడ్డూ ప్రసాదం పొందడం వల్ల శుభప్రదం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ లడ్డూను దక్కించుకునేందుకు వేలంలో ఎంతో మంది పోటీ పడుతుంటారు. గతేడాది రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత ధర పలుకుతుందా అనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

45ఏళ్ల ఘన చరిత్ర..
బాలాపూర్‌ గణేశుడికి 45 ఏళ్ల ఘన చరిత ఉంది. అయితే, తొలిసారిగా బాలాపూర్‌ ఉత్సవ సమితి 1994లో లడ్డూ వేలాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా కొలను మోహన్ ​రెడ్డి అనే రైతు ఈ లడ్డూను రూ.450లకు కైవసం చేసుకున్నారు. ఈ లడ్డును గ్రామస్తులను ప్రసాదంగా పంచి… మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. దీంతో ఆ తర్వాత ఏడాది.. అంటే 1995లో నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ లడ్డును రూ. 4500కు ఆయనే దక్కించుకున్నాడు. అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. దీంతో బాలాపూర్ లడ్డూకు చాలా మహిమ ఉందని భక్తుల్లో నమ్మకం ఏర్పడింది. అలా ప్రతి ఏడాది వందల నుండి వేలకు, వేలు నుండి లక్షలకు ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాట చేరుకుంది.

లడ్డూ వేలంలో పాల్గొనేందుకు 15ఏళ్ల పాటు స్థానికులకే అవకాశం కల్పించిన బాలాపూర్ ఉత్సవ సమితి, ఆ తర్వాత కాలంలో బయట వ్యక్తులనూ అనుమతించింది. ఆ విధంగా 2009లో సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు దీనిని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు 31 సార్లు లడ్డూ వేలం నిర్వహించగా 2020లో కొవిడ్​ పరిస్థితుల నేపథ్యంలో వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లడ్డూను అందజేశారు. 2024లో కొలను శంకర్‌ రెడ్డి రూ.30.1 లక్షలకు, గతేడాది లింగాల దశరథ్‌ గౌడ్‌ రూ.35 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు.

వేలం డబ్బును ఏం చేస్తారు..?
లడ్డూ వేలం వేయగా వచ్చిన డబ్బును బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అనేక అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తుంది. దేవాలయాల, పాఠశాలల అభివృద్ధికి, ఇతర కార్యక్రమాలకు ఈ డబ్బును ఉపయోగిస్తారు. ఈ విధంగా పలు కార్యక్రమాల నిమిత్తం ఇప్పటి వరకు రూ.1,73,87,970 ఖర్చు చేసినట్లు బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి వివరించారు.