Bandi Sanjay: వరంగల్ మేయర్ పీఠమే టార్గెట్.. గెలిచి మోదీ గిఫ్ట్ ఇద్దాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Published on- June 29, 2026 / 08:29 PM IST
Bandi Sanjay sensational comments on Congress and BRS party at Warangal meeting.
- బండి సంజయ్ తీవ్ర విమర్శలు.
- వరంగల్ అభివృద్ధికి నిధుల దుర్వినియోగం.
- బీజేపీ గెలుపే ఏకైక లక్ష్యం.
Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండున్నరేళ్ల కాంగ్రెస్ హయాంలో ఓరుగల్లు నగరానికి నయా పైసా లబ్ధి చేకూరలేదని విమర్శించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.
కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చినప్పటికీ, వరంగల్ నగరంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక చిన్న తేలికపాటి వర్షానికే నగరం మొత్తం జలమయం కావడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే నగరం నిజమైన అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, అభివృద్ధి అంటే ఏంటో తాము చేసి చూపిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీల లాఠీ దెబ్బలకు భయపడకుండా, ప్రతి కార్యకర్త స్థానిక నివాసితుల ఇళ్లను కనీసం ఆరు సార్లు సందర్శించి ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని సూచించారు. తాము వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఇక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ప్రధాని మోదీ, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ నితిన్ నబిన్‌లకు బహుమతిగా ఇస్తామని బండి సంజయ్ (Bandi Sanjay)ధీమా వ్యక్తం చేశారు.
