Dasara Holidays Extended : ఎల్‌నినో ప్రభావం.. విద్యార్థులకు దసరా సెలవులు పెంపు..
Dasara Holidays Extended : దసరా సెలవులు ముగిశాయి. అయితే, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి కొరత కారణంగా దసరా సెలవులను పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
- Harish Thanniru
- Updated on- October 24, 2026 / 02:58 PM IST
Basara IIIT campus
Dasara Holidays Extended : దసరా సెలవులు ముగిశాయి. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. సుమారు పదమూడు రోజులపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులు మళ్లీ బడుల బాటపట్టారు. అయితే, బాసర రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్ మాత్రం దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెలవులను పొడిగించింది.
Also Read : Mumbai Indians : ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. జయవర్ధనే స్థానంలో కొత్త హెడ్‌కోచ్‌గా విధ్వంసకర ఆల్‌రౌండర్
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, క్యాంపస్ సమీపంలోని చెరువు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో క్యాంపస్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దసరా సెలవుల అనంతరం శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. తీవ్ర నీటి కొరత కారణంగా సెలవులను పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీటి కొరత తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 9వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి రోజుకు సుమారు 25 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం క్యాంపస్ కు కేవలం 15 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోజుకు సుమారు 10లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతోంది.
విద్యార్థులు క్యాంపస్ కు తిరిగి వస్తే తాగునీరు, స్నానాలు, వంటశాలలు, పారిశుద్ధ్య అవసరాలకు నీటిని సమకూర్చడం కష్టం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌కు రోజుకు అవసరమయ్యే 25లక్షల లీటర్లకుపైగా నీటిని నిరంతరంగా సరఫరా చేయగలిగిన తరువాతే తరగతులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
పునఃప్రారంభంపై ఉత్కంఠ..!
దసరా సెలవుల అనంతరం క్యాంపస్ తెరుచుకుంటుందని ఆశించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నీటి కొరత కారణంగా సెలవుల పొడిగింపు ప్రకటన వెలువడటంతో మరికొంతకాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి సరఫరా సమస్య పరిష్కారమై, విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు అందుబాటులోకి వచ్చిన తర్వాతే క్యాంపస్ పునఃప్రారంభంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ త్వరలో తదుపరి ప్రకటన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే జ్ఞాన సరస్వతి కొలువైన బాసర ప్రాంగణంలోనూ భక్తులు తాగునీటి సమస్య తో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వచ్చే జూన్ లో గోదావరి పుష్కరాలు అధికార యంత్రం గానికి అగ్నిపరీక్షగా మారనున్నాయి.
