Telangana Farmers : రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరట.. రుణాల చెల్లింపు, కొత్త రుణాల్లో కీలక మార్పులు..?
Telangana Farmers : తెలంగాణలో కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు పంట రుణాల చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Big Relief for Farmers from Telangana Government
Telangana Farmers : తెలంగాణలో కరువు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు పంట రుణాల చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. కరువు ప్రభావిత మండలాల్లోని రైతులు తీసుకున్న పంట రుణాల చెల్లింపులను 12 నెలల పాటు వాయిదా వేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు గడువు కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రైతులు ఒకేసారి అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కరువు ఛాయలు అలముకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఎల్ నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతోపాటు.. ప్రాజెక్టుల్లో సరిపడా నీరులేక పోవటం, భూగర్భ జలాలు తగ్గడంతో రైతులు సాగుచేసిన పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయిన పరిస్థితి.
2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని మొత్తం 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 111 మండలాలు తీవ్ర కరువు ప్రభావానికి గురైనవిగా, మరో 254 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. పంటలు సరిగా పండకపోవడం, దిగుబడులు తగ్గడం, పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కల్పించేలా రేవంత్ సర్కార్ రుణాల చెల్లింపునకు గడువును పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా రైతులపై ఉన్న పంట రుణాల బకాయిల విలువ సుమారు రూ.20 వేల కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇంత భారీ మొత్తంలో రుణాలు ఉండటంతో రైతులకు చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కరువు ప్రభావం తీవ్రతను బట్టి రైతులకు రుణ చెల్లింపుల గడువును నిర్ణయించే అవకాశం ఉంది.
మధ్యస్థ కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు 36 నెలలు (మూడేళ్లు) గడువు కల్పించే ప్రతిపాదన ఉన్నట్లు.. తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో రుణాల చెల్లింపునకు 60 నెలలు (ఐదేళ్లు) వరకు సమయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అంతేకాక.. ప్రస్తుతం రైతులు తీసుకున్న పంట రుణాలను సాధారణ పంట రుణాలుగానే కొనసాగించకుండా, దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. ఇలా మార్చడం వల్ల రైతులు ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. నిర్ణయించిన గడువు ప్రకారం విడతల వారీగా చెల్లింపులు చేసుకోవచ్చు. మరోవైపు.. వచ్చే పంట సీజన్లో రైతులకు కొత్తగా లేదంటే అదనంగా రుణాలు అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇవన్నీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. బ్యాంకర్ల కమిటీ సమావేశం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.
