తెలంగాణాలో ఉంది రైతులు మార్కెట్ కాదు.. స్కాముల మార్కెట్ : బీజేపీ మహేశ్వర్ రెడ్డి

TG Paddy Procurement : తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడంలో గత బీఆర్ఎస్.. ఇప్పటి కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

BJP Maheshwar Reddy Slams Congress BRS parties alleged Telangana Paddy Procurement Scam

Paddy Procurement : తెలంగాణలో నేటి కాంగ్రెస్, నాటి బీఆర్ఎస్ రెండు పార్టీలు ఔరంగజేబు తరహా నిరంకుశ పాలన సాగిస్తూ.. లోపాయకారీ ఒప్పందాలతో క్షేత్రస్థాయిలో రైతుల గొంతు కోస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులందరినీ కలుపుకుని రైతు భరోసా యాత్ర చేపట్టారు.

వడ్ల కొనుగోళ్ల ఆలస్యం – భారీ స్కామ్:

తెలంగాణలో వడ్ల కొనుగోళ్ల ఆలస్యం వెనక భారీ స్కామ్ ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రోడ్లపైనే ఉంచి సాగదీయడం వెనుక వందల కోట్ల సివిల్ సప్లైస్ కుంభకోణం దాగి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. పక్క రాష్ట్రాల నుండి తక్కువ ధరకే చౌకగా రైస్ కొనుగోలు చేసి ఇక్కడి గోదాముల్లో నింపుతూ, ఆ బియ్యాన్ని కనీస మద్దతు ధర (MSP) కు అమ్ముకుంటూ పెద్దలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. క్వింటాల్ రూ. 1600 కే బియ్యం స్టాక్ అమ్మేసి, వెనక నుండి రూ. 500 చొప్పున బ్యాక్ పేమెంట్లు తీసుకున్నారని ఆరోపించారు.

ధర్నాలు చేస్తే కేసులు – సస్పెన్షన్లు:

సకాలంలో పంట కొనాలని 50 మంది రైతులు ధర్నా చేయగా.. రేవంత్ సర్కార్ వీరిలో 8 మందిపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపాలని చూసిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ‘మక్కలు ఎందుకు కొనడం లేదు?’ అని ప్రశ్నించిన ఒక ఆర్టీసీ వర్కర్‌ను కూడా వెంటనే సస్పెండ్ చేశారని.. సమస్యలు అడిగితే సస్పెన్షన్లు ఇవ్వడం, రైతులను తీవ్రవాదుల్లా చూడటమేనా ప్రజాపాలన అని నిలదీశారు.

Also Read: బిగ్ అలర్ట్.. రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆఫీసుకు వెళ్తున్నారా.. టైమింగ్స్ మారాయి.. రాత్రి వేళ కూడా రిజిస్ట్రేషన్లు..

మంథని నియోజకవర్గంలో అరాచకాలు:

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని పరిధిలోని కటారంలో వడ్లు కొనడం లేదని ప్రశ్నించినందుకు రైతులపై దాడులు చేశారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గుమ్మళ్లపల్లిలో ఒక 70 ఏళ్ల ముసలి రైతు ఆవేదనతో తన చెప్పుతో తనే కొట్టుకోగా, ఆయన తల్లి అయిన 100 ఏళ్ల వృద్ధురాలు సమక్కపై కూడా దాడి జరగడంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు.

బీజేపీ అండ – యాత్ర ప్రభావం:

ఈ అరాచకం గురించి తెలిసిన వెంటనే మహేశ్వర్ రెడ్డి స్వయంగా బాధితులను పరామర్శించి, జిల్లా ఎస్పీ (SP) తో మాట్లాడి అమాయక రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకునేలా చేశారు. బీజేపీ నాయకులు ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్తే అక్కడ అధికారులు ముందే లారీలను, గన్నీ బ్యాగులను పంపి కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నారు. రైతుల హక్కుల కోసం, ప్రతి గింజనూ కొనేవరకు కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచడానికి సిద్ధమని బీజేపీ హెచ్చరించింది.