Uppal Metro Station : ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్.. అసలు విషయమిదే

Uppal Metro Station :

uppal metro officials about bomb threat to station is fake they conduct mockdrill

  • ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు అంటూ ప్రచారం
  • ఇది తప్పుడు సమాచారం అన్న అధికారులు
  • మాక్ డ్రిల్ నిర్వహించామని వివరణ

Uppal Metro Station : భాగ్యనగరంలో అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లలో ఉప్పల్ కూడా ఒకటి. ఈ క్రమంలో శుక్రవారం.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో బాంబు ఉందంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ ఒక్కసారిగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ బెదిరింపు ఫోన్ కాల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, కాసేపటి తర్వాత అధికారులు ఇది కేవలం ‘మాక్ డ్రిల్’ (Mock Drill) అని స్పష్టం చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యవసర సమయాల్లో భద్రతా ఏర్పాట్లు, ప్రయాణికుల స్పందన ఎలా ఉందో పరీక్షించేందుకు ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించామన్నారు. స్టేషన్ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్‌లు, టికెట్ కౌంటర్లు, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ తనిఖీల సమయంలో ప్రయాణికులను కాసేపు ఇతర ప్రాంతాలకు తరలించి, రైళ్ల రాకపోకలను నియంత్రించారు.

ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు అంటూ వచ్చిన వార్తపై మెట్రో అధికారులు స్పందిస్తూ.. ఇది తప్పుడు సమాచారం అన్నారు. మెట్రో స్టేషన్‌లో తనిఖీలు బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్ వల్ల జరిగింది కాదు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మేం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాము. కొన్ని మీడియా సంస్థలు దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. మెట్రో స్టేషన్‌కి ఎలాంటి బాంబు బెదిరింపు రాలేదు. భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించిన మాక్ డ్రిల్ మాత్రమే. దీనిపై ప్రయాణికులు ఆందోళన చెందవద్దు అని అధికారులు స్పష్టం చేశారు.

తిరిగి ప్రారంభమైన సేవలు

మాక్ డ్రిల్ పూర్తయిన వెంటనే మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఉప్పల్ వంటి స్టేషన్లలో ఇలాంటి అకస్మాత్తు తనిఖీలు జరగడంతో సామాన్య ప్రయాణికులు తొలుత కాస్త కంగారు పడ్డారు. తాజాగా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.