Brs Candidate Kidnap: కొత్తగూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం..!
కార్పొరేషన్ పీఠం కైవసం చేసుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని వనమా ఆరోపించారు.
- Naveen
- Published On : February 13, 2026 / 11:08 PM IST
Brs Candidate Kidnap: కొత్తగూడెం కార్పొరేషన్ లో కిడ్నాప్ కలకలం రేగింది. 32వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి రాంబాబును కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కిడ్నాప్ ను నిరసిస్తూ రాంబాబు ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. గుగులోత్ రాంబాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో కార్పొరేషన్ పీఠం కైవసం చేసుకునేందుకు సీపీఐ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయని వనమా ఆరోపించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31. అటు సీపీఐకి కానీ, ఇటు కాంగ్రెస్ కి కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు. ప్రజలు తమను ఆశీర్వదించారని, మేయర్ పదవిని తామే చేపడతామని సీపీఐ నేతలు చెబుతున్నారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసేందుకు మంత్రి పొంగులేటి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
