Balka Suman: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్నారు. పలు అంశాలపై స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కాబోయే సీఎం ఎవరు? కేసీఆర్, కేటీఆర్ లలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? అనే ప్రశ్నకు బాల్క సుమన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ బీఆర్ఎస్ నేతల నుంచి వస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసుంటే ఇప్పుడు ఫలితం మరోలా ఉండేదనే చర్చ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. మరి, రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవ్వడానికి కేటీఆర్ కు అవకాశం ఉందా?
”ఆ విషయాలు మాట్లాడే అంతటి పెద్ద వాడిని కాను నేను. అంత అనుభవం కూడా నాకు లేదు. కేసీఆర్ సమర్థవంతంగా ఉన్నారు. నిన్ననే కేసీఆర్ ను కలిశా. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నన్ను జైల్లో పెట్టి ఏ విధంగా అయితే పైశాచిక ఆనందం పొందారో అదే విధంగా కేసీఆర్ మీద రూమర్స్ చేస్తున్నారు.
ఆయన పెద్ద మనిషి. 72 ఏళ్ల వయసు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం. సుదీర్ఘమైన అనుభవం, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి కూడా. డిప్యూటీ స్పీకర్, రెండుసార్లు ముఖ్యమంత్రి. 15 ఏళ్లు పార్టీని నడిపి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. చెన్నారెడ్డితోనే కాలేదు, అటువంటిది కేసీఆర్ సాధించారు. అటువంటి నాయకుడిని పట్టుకుని ఈ రకమైన దుష్ప్రచారం చేయడం బాధగా ఉంది. అంతిమంగా నేను చెప్పేది.. మా సుప్రీం కేసీఆరే.
రేపు మేము ఎన్నికలకు పోయేది కేసీఆర్ బొమ్మతోనే. రేపు మేము గెలిచిన తర్వాత మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు అందరిదీ ఒకటే మాట. కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. మా దాంట్లో గ్రూపులు ఏమీ లేవు. కేసీఆర్ ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉంటే, ఎంత మంచిగా పరిపాలిస్తే అన్ని రోజులు మేమంతా ఆయన టీమ్ లో, ఆయన డైరెక్షన్ మేరకు పని చేస్తాం” అని బాల్క సుమన్ అన్నారు.