Harish Rao: ఓపక్క కరెంట్ కోతలు.. మరోపక్క ఛార్జీల పెంపు.. కాంగ్రెస్ పాలనపై హరీష్ సంచలన కామెంట్స్
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై BRS నేత హరీశ్ రావు (Harish Rao)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- V Santhosh Kumar
- Updated on- October 6, 2026 / 03:45 PM IST
BRS leader Harish Rao expressed strong anger over the hike in electricity charges.
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యుత్ రంగ వైఫల్యాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, ట్రూ-అప్ ఛార్జీల నెపంతో ఏకంగా రూ.5,420 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఈఆర్సీ ప్రతిపాదించినా భారాన్ని ప్రజలపై వేయలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కరెంట్ కోతలు విధిస్తూనే భారీ బిల్లులతో ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.
స్థానిక సమరానికి సిద్ధమైన కూటమి.. చంద్రబాబు-పవన్ కీలక భేటీ.. మేయర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
కాంగ్రెస్ నిలకడలేని పాలనతోనే విద్యుత్ సంక్షోభం:
కేసీఆర్ పాలనలో రూ.91 వేల కోట్లు వెచ్చించి విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్వహణ లోపాలు, బొగ్గు నిల్వలు, రిజర్వాయర్లలో నీటిని సరిగ్గా వాడుకోకపోవడం వల్లే నేడు థర్మల్ ప్లాంట్లు మూతపడి విద్యుత్ సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. కరెంట్ లేక రైతులు పొలాల వద్ద పాముకాట్లకు గురవుతున్నారని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన ‘మార్క్ కరువు’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రైవేటీకరణ కుట్రలపై సమరశంఖం:
ఒకవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్‌కో, జెన్కోలను ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. తక్షణమే రూ.5,420 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. తుగ్లక్ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
