KTR: డోంట్ కేర్..! కవిత పార్టీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
SIR తో ఓట్లను తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో అదే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారు.
- Naveen
- Updated on- April 27, 2026 / 07:28 PM IST
KTR: తన సోదరి కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. అంతేకాదు తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇక, కేసీఆర్ మర మనిషి అంటూ ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గురించి చాలామంది చాలా మాట్లాడుతుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్.
”పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి. 25ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ మాది. 25ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉన్నాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో టీడీపీ, తర్వాత టీఆర్ఎస్. వేరే పార్టీలు ఏవీ లేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం అయితే కాదు” అని కేటీఆర్ అన్నారు.
”బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశాం. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాం. తెలంగాణ ఉద్యమంలో మాతో నడిచిన సకలజనులను గుర్తు చేసుకున్నాం. చావు నోట్లో తల పెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన విధానాన్ని ఈ సమావేశంలో కేసీఆర్ వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు రైతులకు ఏ విధంగా ఇచ్చామో కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా ధ్యానం కొనుగోలు చేశాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పరిపాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదు.
బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే రణరంగమే..
ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా ఉండాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాము. సింగరేణి కార్మికుల సమస్యలపై తీర్మానం చేశాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించాం. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలను వెంటనే ఖండించే వాళ్ళం. సభలో రణరంగం చేసే వారు. తేజస్వీతో క్షమాపణలు చెప్పించి ఉండే వాళ్లం. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి.
SIR తో ఓట్లను తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో అదే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనికుల్లా పని చేస్తాం. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశాం. స్టేట్ కమిటీ తప్ప బూత్ కమిటీ నుంచి జిల్లా కమిటీలన్నీ రద్దయ్యాయి. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేస్తాం.
సభ్యత్వ నమోదును రెండు మార్గాల్లో చేస్తాం. ఒకటి ఆన్ లైన్, రెండు పేపర్. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోగానే వారందరికీ శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. శిక్షణ తరగతుల తేదీలు, పార్టీ కమిటీలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ తేదీలను త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
వేసవి కాలంలో సాగు, తాగు నీటి సమస్య మరింత ఎక్కువైంది. హైదరాబాద్ లో కేసీఆర్ నివాసంలో ట్యాంకర్ పోసే పరిస్థితి వచ్చింది. SIR విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తం అయ్యాము. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి క్రియాశీలకంగా పని చెయ్యాలని కేసీఆర్ చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోతే వచ్చే రోజుల్లో టికెట్స్ ఇవ్వమని కేసీఆర్ చెప్పారు. కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. బీఆర్ఎస్ 25ఏళ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ కాలం ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీనే. చీఫ్ మినిస్టర్ చీప్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తించడం లేదు” అని కేటీఆర్ అన్నారు.
Also Read: ఉన్న పార్టీకే దిక్కులేదు, ఇక కొత్త పార్టీ ఎందుకు? కవిత పార్టీపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..
