Chicken Price Drop : నాన్వెజ్ లవర్స్ కి నోరూరించే వార్త.. భారీగా పడిపోయిన చికెన్ ధర.. షాపుల ముందు క్యూ కట్టిన జనాలు

Chicken Price Drop : మాంసం ప్రియులకు పండగ లాంటి వార్త. చికెన్ ధర భారీగా దిగి వచ్చింది.

chicken price drop by rs 100 on kg on in hyderabad on march 29

Chicken Price Drop : గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరగడం తప్ప దిగి రావడం తెలియదన్నట్లుగా పైపైకి పోతున్నాయి. చివరకు కిలో చికెన్ ధర రూ.380-400 కు చేరుకుంది. దీంతో చాలా మంది నాన్ వెజ్ లవర్స్ చికెన్ కొనాలంటేనే భయపడ్డారు. కేజీ తీసుకునే చోట అర కేజీ మాత్రమే కొన్నారు. చాలా మంది కోడి బదులు గుడ్డుతో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే చికెన్ అమ్మకాలు తగ్గడంతో వ్యాపారులు సైతం డీలాపడిపోయారు. గత నాలుగైదు వారాలుగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చికెన్ దుకాణాల పరిస్థితి ఇదే. కానీ నేడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. చికెన్ షాపుల ముందు జనాలు క్యూ కట్టారు. కారణం చికెన్ ధర భారీగా దిగి రావడం.

చికెన్ ధర నేడు భారీగా తగ్గింది. ఏకంగా కేజీ మీద రూ.100 వరకు తగ్గడంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. మార్చి 29, ఆదివారం హైదరాబాద్‌లో కిలో చికెన్‌ ధర రూ.270 పలుకుతోంది. అటు నారాయణపేట, రంగారెడ్డి, వరంగల్‌ వంటి పలు జిల్లాల్లో కూడా చికెన్‌ ధరలు భారీగానే తగ్గాయి. స్కిన్డ్ చికెన్‌ ధర కేజీ రూ.235 నుంచి రూ.240 వరకు ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.267 నుంచి రూ.280 మధ్య ఉంది. కేజీ మీద ధర గణనీయంగా తగ్గడంతో నేడు చికెన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు.

గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో చికెన్ ధరలు తగ్గాయని, మళ్లీ అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా చికెన్ ధరలు దిగి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కిలో చికెన్‌ రూ.300-రూ.350 మధ్య పలుకుతోంది. ఇక ఈ ఆదివారం చికెన్‌ ధర కాస్త తగ్గడంతో మాంసం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ ఆసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల.. గల్ఫ్ దేశాలకు గుడ్డు ఎగుమతులు నిలిచిపోవడంతో ఎగ్ ధర రూ.4కి పడిపోయింది.