Conductor Pravallika : ప్రాణాలు తీసిన ‘చిల్లర’ గొడవ.. ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. పది రోజులు మృత్యువుతో పోరాడి..
Conductor Pravallika : చిల్లర కోసం బస్సులో జరిగిన వివాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కండెక్టర్ ప్రవళిక మృతి చెందింది.
Conductor Pravallika
Conductor Pravallika : చిల్లర కోసం బస్సులో జరిగిన వివాదం యువ కండెక్టర్ మృతికి కారణమైంది. పది రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన యువతి.. బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఈ ఘటన యువ కండెక్టర్ కుటుంబ సభ్యులతోపాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
భద్రాచలం కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద బస్సులో గత నెల 25న చిల్లర విషయంలో మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక, ప్రయాణికురాలి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను తోసేసింది. ప్రమాదవశాత్తూ ప్రవళిక కాలుజారి బస్సు టైర్ల కింద పడిపోవటంతో ఆమె కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను మైదరాబాద్ లోని కొత్తపేట సాయి సంజీవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ప్రవళిక తుదిశ్వాస విడిచింది.
ప్రవళిక మృతిపై ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉండాలని, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వాన్ని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కాగా.. ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రవళిక మృతివార్త తెలుసుకున్న టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతివార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక ఆరోగ్యం మెరుగుపడి మళ్లీ విధుల్లోకి వస్తుందని ఆశించామని, కానీ, ఇంతలోనే ఆమె మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా..
మహిళా కండెక్టర్ ప్రవళిక మృతి బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరపున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ప్రవళిక తల్లికి ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
