కేసీఆర్ బతికి ఉన్నంత కాలం రైతు బంధు డబ్బు ఆగదు: సీఎం

cm kcr: జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించడమంటే ప్రతీ రైతు అకౌంట్లో రూ.2నుంచి 3లక్షల వరకూ డబ్బు నిల్వ ఉండాలని తెలిపారు. అప్పులన్నీ తీర్చినప్పుడే రైతుకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆ రోజులు వచ్చేవరకూ తానూ నిద్రపోనని రైతులను నిద్రపోనివ్వనని వెల్లడించారు.

ఉమ్మడి ఏపీ పరిస్థితులను గురించి చెప్పుకొచ్చిన కేసీఆర్.. ‘ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రైతుల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎరువులు, విత్త‌నాలు స‌కాలంలో పంపిణీ చేయ‌లేదు. తెలంగాణ రాష్ర్టంలో రైతులు ప్రశాతంగా ఉంటున్నారు. ఇంకా బాగుండాలి. గ్రామాలు మంచిగా ఉండాలి.



గతంలో డీలా పడిపోయిన వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాం. తెలంగాణ సాగు విస్తీర్ణం ప్రస్తుతం కోటి 35లక్షల ఎకరాలుగా ఉంది. అందులో 53లక్షల ఎకరాలు వరి పంటే ఉంది. అంతగా బాగుపడింది.

మేం చిన్నప్పుడు మా ఇంట్లో దొంతుల అర ఉండేది.. అందులో విత్తనాలు పెట్టేవాళ్లం. బయట దొరుకుతున్నాయి కాబట్టే. ఈ రైతు వేదికలను సుమారు 600కోట్లు ఖర్చు పెట్టి కట్టించాం. రాబోయే కాలంలో మీరే విస్తరించుకుంటారనే నమ్మకం నాకుంది. ఈ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని గుర్తించి మీకు లాభం జరిగే విధంగా మారాలి. అధికారులు.. రైతు వేదికలు పెట్టి అంతా కలిసి రైతులను విజ్ఞానవంతులను చేయాలి.

ఆషామాషీగా కట్టినవి కావు. మన రైతాంగం అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శం కావాలని చేశాం. ఈ ప్రాంతంలో కూడా చేనేత కార్మికులు బతికే విధంగా నియోజకవర్గంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తాం.

దళితులు బాధ అనుభవిస్తున్నారు. సామాజిక వివక్ష ముగిసిపోవాలి. ఎస్సీఎస్టీలు కూడా అభివృద్ధి అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో 4కోట్ల బిడ్డలు బతికే విధంగా.. అందరినీ సమానంగా చూసుకున్నాం. కేసీఆర్ బతికినన్ని రోజులు రైతు బంధు డబ్బులు వస్తాయి. ఎటువంటి పైరవీలు లేకుండా మీకు అందుతాయి. పల్లెలు పట్టుకొమ్మల్లా ఉండాలి.

సన్న బియ్యం పండించిన రైతులకు కూడా లాభం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. లావు వడ్లు పండించిన రైతుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్లాన్ చేస్తున్నాం. మరోసారి మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై లాభదాయకమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.