Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. 15వరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. బయటకు రావొద్దు..

Telangana Rains : తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. 15వరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. బయటకు రావొద్దు..

Telangana Rains

Updated On : September 11, 2025 / 5:44 PM IST

Telangana Rains : తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇటీవల కాలంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిప్రవహించడంతోపాటు.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే, గత వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read: RBI Purchased Land : వామ్మో.. ఎకరం రూ.800 కోట్లు.. కొన్నది ఆర్బీఐ.. అమ్మింది..

ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరదనీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్ నగర్‌లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రహదారులపై నీరుచేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లోకి వరద నీరు కొనసాగుతుంది. వరద ఉధృతి పెరగడంతో మరిన్ని గేట్లు ఓపెన్ చేసేందుకు జలమండలి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా 460 క్యూసెక్కుల వరద.. హిమాయత్ సాగర్ నుంచి 1350 క్యూసెక్కుల వరద మూసీలోకి వలిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.