RBI Purchased Land : వామ్మో.. ఎకరం రూ.800 కోట్లు.. కొన్నది ఆర్బీఐ.. అమ్మింది..
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఆర్బీఐ భూమిని కొనుగోలు చేసింది.

RBI Purchased Land
RBI Purchased Land : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన స్థిర ఆస్తులను మరింత పెంచుకునే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల భారీ మొత్తాన్ని వెచ్చించి కొంత భూమిని కొనుగోలు చేసింది. అయితే, ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద భూ ఒప్పందాల్లో ఇది ఒకటిగా రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: RBI Lock Phones : EMIల్లో ఫోన్లు కొనేవాళ్లు అందరికీ బిగ్ అలర్ట్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..!
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL)కు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద 4.16 ఎకరాల ఖాళీ భూమిని ఉంది. ఆ భూమిని రూ. 34,71,82,03,270 (రూ.3,471 కోట్లు) భారీ మొత్తం చెల్లించి ఆర్బీఐ కొనుగోలు చేసింది. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన CRE మ్యాట్రిక్స్ నుండి సేకరించిన డేటా ప్రకారం.. ఈనెల 5వ తేదీన ఈ భూమి కొనుగోలుకు సంబంధించి స్టాప్ డ్యూటీని ఆర్బీఐ రూ. 2,08,30,92,200 చెల్లించింది.
దక్షిణ ముంబైలోని ప్రధాన వ్యాపార కేంద్రంగా భావించే నారిమన్ ప్రాంతంలో ఈ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, బాంబే హైకోర్టు, అనేక ప్రముఖ కార్పొరేట్ కార్యాలయాలకు సమీపంలో వ్యూహాత్మక పాయింట్‌గా ఈ భూమి ఉంది. 1970ల ప్రారంభం నుంచి నారిమన్ పాయింట్ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ముంబైలో తమ పరిధిలో ఉన్న ముఖ్యమైన భూములను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తుంది. ఇందులో భాగంగా గత సంవత్సరం నారిమన్ పాయింట్ వద్ద ఉన్న భూమిని గ్లోబల్ టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అయితే, ఆర్బీఐ తన ప్రధాన కార్యాలయ విస్తరణకు ఈ ప్లాట్ ను కొనుగోలు చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేయడంతో ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ఈ భూమిని వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకొని ఆర్బీఐకి విక్రయించింది.
ఆర్బీఐ ఇప్పటికే ముంబైలో మింట్ రోడ్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. అంతేకాక.. నూతనంగా కొనుగోలు చేసిన నారిమన్ పాయింట్ వద్ద భూమిని సంస్థాగత అవసరాల కోసం అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోన్నట్లు తెలిసింది.