CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో సమన్వయలోపం.. కొద్దిసేపు హెలికాప్టర్లోనే ఉండిపోయిన సీఎం, మంత్రులు.. అసలేం జరిగిందంటే?
CM Revanth Reddy : ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి శనివారం యాదగిరి గుట్టలో పర్యటించారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో రూ.99.55 కోట్లతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
- Harish Thanniru
- Updated on- May 23, 2026 / 11:03 AM IST
CM Revanth Reddy visit to Yadagirigutta
- యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన
- సీఎం పర్యటనలో సమన్వయలోపం
- కొద్దిసేపు హెలికాప్టర్లోనే ఉండిపోయిన సీఎం, మంత్రులు
CM Revanth Reddy : ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి శనివారం యాదగిరి గుట్టలో పర్యటించారు. ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం, మంత్రులు శ్రీలక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో రూ.99.55 కోట్లతో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.43.80 కోట్లతో వేద పాఠశాలకు, రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణానికి, రూ.1.35కోట్లతో రథశాలవైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
పది నిమిషాలు హెలికాప్టర్లోనే..
శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పెద్దగుట్టపైకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. కొండ కింద ఉన్న హెలిపాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కొండ కింద హెలిపాడ్ వద్ద కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు వేచి ఉన్నారు.
కానీ, అనూహ్యంగా టెంపుల్ సిటీ పైన ఉన్న హెలిపాడ్‌లో సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయింది. టెంపులు సిటీ హెలిపాడ్ వద్ద స్వాగతం పలికేందుకు ఎవరూ లేకపోవటంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొద్దిసేపు హెలికాప్టర్లోనే ఉండిపోయారు. కాన్వాయ్ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపటి అనంతరం హెలికాప్టర్ నుంచి దిగిన సీఎం, మంత్రులు నడుచుకుంటూ వేద పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్ వద్దకు నడుచుకుంటూ వెళ్లిపోయారు.
హెలికాప్టర్ టెంపుల్ సిటీ హెలిపాడ్ వద్ద ల్యాండ్ కావడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులు హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. అనంతరం సీఎం పర్యటనలో నిమగ్నమయ్యారు.
