CM Revanth Reddy
CM Revanth Reddy : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీల పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండల్ నియోజకవర్గంలోనూ ఎక్కువ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించారు.
నారాయణపేట జిల్లా కోస్గీలోని ఓ ఫంక్షన్ హాలులో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మేళనం, సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు హాజరుకాగా.. ఆయా మండలాలకు చెందిన దాదాపు 180 మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన సర్పంచులకు శుభవార్త చెప్పారు.
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంతాలు వీడి పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని 12,706 మంది సర్పంచులకు ఇదే సూచన చేస్తున్నా.. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు సీఎం నిధుల నుంచి ఇస్తా. ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఈ నిధులను నేరుగా సర్పంచ్ కే అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇవి అదనం. కేంద్రం నుంచి రూ.3వేల కోట్లు తెచ్చే బాధ్యత నాది. హామీలు నెరవేర్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ పై విమర్శలు..
మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ రేంజ్ లో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి అంతే ఘాటుగా బదులిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ‘‘నీ రాజకీయం ఏంటో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషంలాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర ఖతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్ర తప్ప.. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగేది ఏమీ లేదు” అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.