CM Revanth Reddy : అన్నదాత సంతోషంకోసం అన్నగా బాధ్యత తీసుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..

CM Revanth Reddy : రైతుభరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

CM Revanth Reddy

  • సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
  • రైతుల సంతోషంకోసం అన్నగా బాధ్యత తీసుకున్నా
  • కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రైతే రాజు
  • రైతును ధైర్యంగా సాగుమడిలో నిలబెట్టేందుకు భరోసా

CM Revanth Reddy : రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఇవాళ సాయంత్రం 4గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read : Telangana Govt : అంగన్‌వాడీ వర్కర్ల‌కు గుడ్‌న్యూస్.. ఇక వారి ఇబ్బందులకు చెక్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

‘‘అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నలకోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు.. కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి‌చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నాం.’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 73లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా పథకం కింద 1.50కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.9వేల కోట్లను సమకూర్చుకుంది. అయితే, రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32లక్షల మందికి ఎకరం వరకు, 48.68లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి.

తొలి విడతలో ఎకరం భూమి కలిగిన 24.32లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లను ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి సోమవారం రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరుతాయి. . ఇరవై రోజుల తరువాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతలో రూ.2,760 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.