Warangal Airport: వరంగల్ ఎయిర్పోర్టుకు పేరు పెట్టండి.. ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్ పిలుపు
వరంగల్ విమానాశ్రయ(Warangal Airport) కల త్వరలోనే సాకారం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
cm revanth reddy invites name suggestions for warangal mamnoor airport
Warangal Airport: ప్రజా ప్రభుత్వ నిరంతర కృషితో చారిత్రక వరంగల్ నగర విమానాశ్రయ కల త్వరలోనే సాకారం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయానికి తగిన పేరును సూచించాల్సిందిగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పక్కనబెట్టిన ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు రూ. 295 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి, భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఇది పరిశ్రమలు, పర్యాటకం, ఉద్యోగాలకు కొత్త గేట్వేగా మారుతుందన్నారు.
మూడు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు.. తుది దశకు చేరిన టెండర్లు!
మామునూరు విమానాశ్రయ (Warangal Airport)ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. విమానాశ్రయాన్ని మొత్తం మూడు ప్యాకేజీలుగా నిర్మించాలని ఏఏఐ నిర్ణయించగా, మొదటి ప్యాకేజీలో 953 ఎకరాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, రెండో ప్యాకేజీలో రన్వే, పార్కింగ్, సీవరేజ్ పనులు చేపట్టనున్నారు. ఇక చివరి ప్యాకేజీ కింద రూ. 213.59 కోట్లతో ప్రయాణికుల టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, ఫైర్ స్టేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
డిసెంబరులో శంకుస్థాపన.. నవంబరు నాటికి పూర్తి!
మూడో ప్యాకేజీకి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ ఏడాది నవంబరు నాటికి టెండర్లను ఖరారు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రక్రియ అంతా సజావుగా సాగితే డిసెంబరు మాసంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏఏఐ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. శంకుస్థాపన అనంతరం అత్యంత వేగంగా పనులు పూర్తి చేసి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
