Cm Revanth Representative Image (Image Credit To Original Source)
Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. క్యాబినెట్ విస్తరణ ఆలోచన లేదంటూ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఆధారంగానే మిగిలిన వారిని విచారిస్తున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని డాక్యుమెంట్లు పెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచారని అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న, ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రచారం అవుతున్న అంశాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై మీడియా రేవంత్ రెడ్డిని అడగ్గా.. క్యాబినెట్ విస్తరణ అంశంపై తనకు ఎలాంటి ఆలోచన లేదని, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరపాలన్న ఆలోచనలో తాను లేను అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేని మంత్రివర్గ విస్తరణ అంశంపైనే కలిశారన్న ప్రచారం జరుగుతోందని రేవంత్ ను మీడియా అడగ్గా అలాంటిదేమీ లేదన్నారు. తన విదేశీ పర్యటన, దావోస్ టూర్, మున్సిపల్ ఎన్నికలు.. ఈ అంశాలపై పార్టీ పెద్దలకు వివరించాల్సిన అవసరం ఉంటుందని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానని రేవంత్ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై ఒకటికి రెండుసార్లు కలిస్తే కేంద్రం పెద్దల్లో చలనం వస్తుందని, అందుకే పదే పదే కేంద్రం పెద్దలను కలుస్తున్నానని రేవంత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా సీఎం రేవంత్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తదుపరి దర్యాఫ్తు ఏంటి అనేది అధికారులే నిర్ణయిస్తారని చెప్పారు. మేము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇతరుల ఫోన్లు వినడం చాలా తప్పు అని అన్నారు. అది వారిని మానసిక క్షోభకు గురి చేస్తుందన్నారు. ఈ కేసులో ఎలా పడితే అలా ముందుకు వెళ్లబోమని, ఎవరినీ జైల్లో వేయబోము అని రేవంత్ తేల్చి చెప్పారు. ఏదైనా చట్టం ప్రకారమే జరగుతుందన్నారు.
Also Read: మారిన ముఖచిత్రం.. “గ్రేటర్” విలీనం, విభజన కొత్త సమస్యలకు దారితీసిందా?