Cm Revanth Reddy: రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. రేపటిలోగా ఖాతాల్లోకి డబ్బులు
గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను అలా కాదు. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను.
- Naveen
- Published On : March 22, 2026 / 06:14 PM IST
- రైతు భరోసా నిధులు విడుదల
- మొదటి విడతగా రూ. 3వేల 600 కోట్లు రిలీజ్
- 70 లక్షల మంది రైతులకు లబ్ది
- ఇవాళ బ్యాంకులకు సెలవు, రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
Cm Revanth Reddy: మాది రైతు ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా రైతుల సంక్షేమాన్ని ఆపడం లేదని రేవంత్ చెప్పారు. ఇవాళ దాదాపు 3600 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గత కేసీఆర్ పాలనలో రైతుల కోసం నెలకు రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదనే నానుడిని తాను నమ్ముతానన్నారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా మొత్తాన్ని పెంచామని గుర్తు చేశారు. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశామన్నారు. రైతును రాజును చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
”గత పాలకులు విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. నేను నేతలతో వ్యతిరేకిస్తాను. కానీ, ప్రజల పట్ల వివక్ష చూపించను. సిద్ధిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చాను. వివక్ష చూపే వ్యక్తినే అయితే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కొడంగల్ కు తీసుకెళ్లే వాడిని. ప్రజలు బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారం ఇచ్చారు, మాకు కూడా రెండుసార్లు ఇస్తారు. రాబోయే రోజుల్లో యూరిత కొరత వచ్చేలా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల మనకు యూరియా సమస్య రావొచ్చు. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా బీజేపీ ఎంపీలు చూడాలి. ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపే నేతను కాను నేను. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. సిద్ధిపేట నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తా” అని రేవంత్ అన్నారు.
3 విడతల్లో 9వేల కోట్లు జమ..
మరోవైపు నర్మెట్టలో రైతు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్.. రైతుభరోసా స్కీమ్ నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 3వేల 600 కోట్లు బటన్ నొక్కి రిలీజ్ చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది. రైతు భరోసా డబ్బులు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో నిధులు రేపు జమ కానున్నాయి. మిగతా నిధులు రెండు విడతల్లో విడుదల చేయనుంది ప్రభుత్వం. మొత్తంగా 3 విడతల్లో 45 రోజుల వ్యవధిలో 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
”మొదటి విడతగా 70 లక్షల మంది రైతులకు రైతుభరోసా చెల్లింపు. రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ. రేపటిలోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. మరో 20 రోజుల్లో రైతు భరోసా కింద మరో 2వేల 650 కోట్లు విడుదల చేస్తాం. ఏప్రిల్ నెలాఖరులోగా మిగతా నిధులు విడుదల చేస్తాం. మొత్తంగా రైతుల ఖాతాల్లో 9వేల కోట్ల రూపాయలు జమ చేస్తాం” అని సీఎం రేవంత్ అన్నారు.
సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. రిఫైనరీకి శంకుస్థాపన కూడా చేశారు. అలాగే యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేశారు.
