Cm Revanth Reddy: నగరాన్ని రక్షించుకోవాలన్నదే మా లక్ష్యం- మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్
చంద్రబాబు, వైఎస్ లు ప్రపంచ ఐటీ కంపెనీలను నాడు తీసుకురాకుంటే ఇంత అభివృద్ధి ఉండేదా? సీఎంగా బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకున్నా.
- Naveen
- Published On : March 13, 2026 / 10:37 PM IST
Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)
- నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగింది
- మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ క్షమించదు
- మూసి కాలుష్య విషంతో బాధపడుతున్న నల్గొండ రైతుల గురించి ఎందుకు మాట్లాడరు?
Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళన ఎందుకు అవసరమో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. నగరాన్ని రక్షించుకోవాలన్నదే మా లక్ష్యం, అందుకే మూసీ ప్రక్షాళన అని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతపై ముఖ్యమంత్రి రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో మూసీ ఇన్వైట్స్ కార్యక్రమం నిర్వహించారు. మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కాగా బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించాయి.
మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ క్షమించదు..
మూసీ ప్రక్షాళనపై ప్రజలకు వివరించేందుకు ఈ ప్రజంటేషన్ అని రేవంత్ చెప్పారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలను రేవంత్ ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూసీ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. మూసీ ప్రక్షాళనపై కొందరు నిపుణులు, ప్రొఫెసర్లు, ప్రజాప్రతినిధులు ఉద్దేశ్యపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఆందోళనకు గురి చేశారని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రజలపై ఆధిపత్యం చేయదని, ఏది చేసినా ప్రజల కోసమే అని తేల్చి చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ క్షమించదన్నారు.
”కోటి 34 లక్షల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు. కొందరు నిజాం పాలనను వ్యతిరేకించొచ్చు. కానీ నిజాం సైతం గొప్ప పనులు చేశారు. వరదల నియంత్రణ కోసం.. మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో నిజాం ప్రాజెక్టులు నిర్మించారు. హెరిటేజ్ నిర్మాణాలతో గొప్ప వారసత్వ సంపదను నిర్మించారు.
విమర్శలు వద్దు.. పని మీదనే మా దృష్టి. పదేళ్లు పాలించామని చెబుతున్న వారు ఎందుకు మూసీని పట్టించుకోలేదు?
మంచి ఉద్దేశంతో నగరాన్ని రక్షించుకోవాలన్నదే మా లక్ష్యం. చంద్రబాబు, వైఎస్ లు ప్రపంచ ఐటీ కంపెనీలను నాడు తీసుకురాకుంటే ఇంత అభివృద్ధి ఉండేదా? సీఎంగా బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. చేసిన పనులనే భవిష్యత్ గుర్తుంచుకుంటుంది. ప్రపంచంలో దొరికే మేటి వస్తువులు చార్మినార్ దగ్గర దొరుకుతాయి. నాడు నిజాం చార్మినార్ చుట్టూ SEZ సృష్టించారు. నిజాంను గుర్తు చేసుకోకుండా హైదరాబాద్ లేదు. కన్యా కుమారి మాదిరే బాపూ ఘాట్ అని ఎందుకు ప్రజలు గుర్తించడం లేదు? మూసా-ఇసా నదుల సంఘం బాపూ ఘాట్.
మూసి కాలుష్య విషంతో బాధపడుతున్న నల్గొండ రైతుల గురించి ఎందుకు మాట్లాడరు? ఆ ప్రాంతాల్లో పండించిన పంటలు విషమే. వారికి ఈ శిక్ష ఎందుకు? మానవ, పశువుల కళేబరాలు, కాలుష్యంతో మూసి నిండిపోయింది. రాజకీయ అవసరాల కోసం.. మూసీ చరిత్రను కాల గర్భంలో కలిపేద్దామా?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
