CM Revanth Reddy: కేసీఆర్‌ చేసిన అప్పులకు లక్షల కోట్ల వడ్డీలు.. ఏకంగా రూ.80 వేల కోట్లు.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్(CM Revanth Reddy) గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Cm revanth reddy launches development works worth 9050 crore in vikarabad

CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లలో కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దివాళా తీసే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రూ.9,050 కోట్ల విలువైన పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

VC Sajjanar: ఏఐ సైబర్ దాడులపై అలర్ట్.. పాత APIలను వెంటనే మార్చండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు!

ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు.. ఏటా రూ.80 వేల కోట్ల వడ్డీ చెల్లింపులు:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ 2024 జనవరి 1 నుంచి ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే సంక్షేమ పథకాల నిధులను పదో తేదీ లోపు, కాంట్రాక్టర్ల బిల్లులను 20వ తేదీ లోపు చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులు, తప్పుల కారణంగా తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు కట్టిందని, ప్రతి ఏటా రూ.80 వేల కోట్లు కేవలం వడ్డీల రూపంలోనే చెల్లిస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు.

రూ.9,050 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు.. వికారాబాద్‌ రూపురేఖలు మార్చే ప్రణాళికలు:

ఈ సభ సందర్భంగా హకీంపేట్ ప్రాంతంలో ఎకో పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపనతో పాటు నాచారం నుంచి కొత్వాల్‌గూడ వరకు రూ.5,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న రేడియల్ రోడ్డు నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పాలమూరు, వికారాబాద్ ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత వలసలకు శాశ్వతంగా చెక్ పెడతామని సీఎం స్పష్టం చేశారు.

పాలమూరును కేసీఆర్ విస్మరించారు.. ప్రాజెక్టులను అడ్డుకుంటే సహించేది లేదు:

పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్‌ను గెలిపించి సీఎంను చేస్తే, ఆయన ఆ ప్రాంత రుణాన్ని తీర్చుకోకుండా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి గజ్వేల్‌కు పారిపోయారని రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు మక్తల్-నారాయణపేట ప్రాజెక్టును పక్కన పడేసిన బిఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కార్యరూపం ఇస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.