Hyderabad Metro: మెట్రోను ముంచిన కేసీఆర్.. అడ్డుపడుతున్న కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ ఫైర్

Hyderabad Metro: హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)స్పష్టం చేశారు.

CM Revanth Reddy makes key remarks on the Hyderabad Metro project.

  • మెట్రో పనులను కేసీఆర్ ఆలస్యం చేశారు.

  • రుణం రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారు.

  • కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోంది.

CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Cm Revanth Reddy)స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ హయాంలో రూ.15వేల కోట్లతో ఈ మెట్రో పనులకు పునాది పడిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తీవ్రంగా ఆలస్యమైందని సీఎం ఆరోపించారు.

కేసీఆర్ నిర్లక్ష్యం.. పెరిగిన అంచనా వ్యయాలు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2017 మధ్య మూడేళ్ల పాటు మెట్రో పనులు పూర్తిగా నిలిచిపోయాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ రకరకాల సాకులు చెప్పి కాలయాపన చేయడం వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం అదనంగా రూ.7వేల కోట్లకు పైగా పెరిగిందని ధ్వజమెత్తారు. మొదటి దశ మెట్రో వల్ల ఏటా రూ.400 కోట్ల నష్టం వస్తోందని ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ చేతులెత్తేసిందని, అందుకే రెండో దశ (ఫేజ్-2) విస్తరణకు వారు నిరాకరించారని తెలిపారు. ఈ క్రమంలోనే రూ.30వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15వేల కోట్లకు కొనుగోలు చేసే ప్రక్రియకు కేంద్రం సూచనలతో తాము సిద్ధమయ్యామన్నారు.

కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు: సీఎం ధ్వజమెత్తారు:

మెట్రో రెండో దశ విస్తరణ కోసం ఐఆర్ఎఫ్‌సీ (IRFC) నుంచి రూ.13,400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీకే 20 ఏళ్ల కాలపరిమితితో పొందేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎం వివరించారు. ఇందుకోసం రూ.84 కోట్ల డాక్యుమెంట్ ఫీజుతో పాటు, ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు కూడా జమ చేశామన్నారు. అయితే, మే 21న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ రుణం బదిలీ ప్రక్రియను అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి కుట్రల వల్లే ప్రస్తుతం మెట్రో లోన్ బదిలీ నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్‌లోనే కేంద్రమంత్రి కుట్రలు:

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, ఆయన వెనుక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కేటీఆర్ పన్నుతున్న కుట్రలను కిషన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో విస్తరణ జరిగే ప్రాంతాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని, అందుకే రాజకీయ స్వార్థంతో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రధాని మోదీ మెట్రో ప్రయాణాన్ని ప్రోత్సహిస్తుంటే, కేంద్రమంత్రి మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అహ్మదాబాద్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు ఇస్తూ హైదరాబాద్‌పై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని విమర్శించారు.

NOC ఇస్తే సన్మానిస్తాం: రేవంత్ రెడ్డి సవాల్

“కేంద్ర ప్రభుత్వం రూపాయి నిధులు ఇవ్వకపోయినా పరవాలేదు, కనీసం ఎన్‌ఓసీ (NOC) ఇస్తే మెట్రో విస్తరణ ఖర్చు రూ.40 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని కేంద్రం నుండి నిధులు ఇప్పించి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇప్పిస్తే ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానిస్తానని సీఎం సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్‌రెడ్డి వెంటనే స్పందించి నిధులు విడుదల చేయించాలని, లేదంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.