Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి అదిరిపోయే శుభవార్త..
Telangana Govt : రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
- Harish Thanniru
- Updated on- May 27, 2026 / 07:57 AM IST
Telangana CM Revanth Reddy
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి శుభవార్త
- ప్రతీనెల 1వ తేదీనే జీతాలు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జూన్2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా వేతనాలు అందాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 50కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించబోమన్నారు. స్వంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని (Own Source Revenue) ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని అధికారులను ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత పెన్షన్ పంపిణీ విధానాన్ని మార్చి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. పెన్షన్లు అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, SEEEPC సర్వే డేటా ఆధారంగా పెన్షన్లను క్రమబద్ధీకరించాలని చెప్పారు. కొత్త పెన్షన్ల మంజూరు విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
