×
Ad

CM Revanth Reddy : భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం కావాలి.. పోలీస్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచన

CM Revanth Reddy : రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు సూచించారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.

Also Read : Heatstroke Death Compensation : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతులకు పరిహారం పెంపు.. కానీ, ఆ సర్టిఫికెట్లు కంపల్సరీ

ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 (Telangana Police Officers Retreat 2026) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసింగ్‌కు సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల ఆవశ్యకతను ముఖ్యమంత్రి  దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను ఆవిష్కరించారు.

పోలీసు అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో దేశంలో తెలంగాణ ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, అందుకు పోలీసు శాఖను అభినందిస్తున్నానని తెలిపారు. అయితే, 2047 లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా ఎంపవర్ కావలసిన అవసరం ఉందని అన్నారు.

ఫ్యూచర్ రెడీ కోసం పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలు, అనుసరించాల్సిన విధానం, దానికి చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శితో కూడిన కమిటీని నియమిస్తామని, ఆర్థిక, న్యాయ, సాంకేతిక, పరిపాలన పరమైన అంశాలను చర్చించిన తర్వాత చట్టరూపం కల్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. పోలీసు శాఖను ఎంపవర్ చేయడానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదని, కానీ, ఫలితాలొచ్చే విధంగా ఆ నిధులు సద్వినియోగం అవుతాయన్న ఒక విశ్వాసం కల్పించాలని పేర్కొన్నారు.

మనకున్న ఫిజికల్ క్రైమ్, మన ఎకోసిస్టమ్ ఆధారంగా మాన్యువల్స్ రాసుకున్నాం. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నేర స్వరూపమే పూర్తిగా మారిపోయింది. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి కొత్త సమస్యలొచ్చాయి. పోలీసు అధికారులు మొట్టమొదట సమస్య ఏంటో అర్థం చేసుకోగలగితే సగం సమస్య పరిష్కారమైనట్టే. సమస్య అర్థంకానప్పుడు వేగంగా పరిష్కరించాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడమే కాకుండా నేర పరిశోధన, ఇతరత్రా పోలీసు శాఖలో ఉన్న సమాచారానికి సంబంధించిన డేటాను ICCC కంట్రోల్ రూమ్‌తో కనెక్ట్ చేయాలని, ఏ పోలీస్ స్టేషన్‌లో ఏ సమాచారం కావాలన్నా నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో అనుసంధానం ఏర్పాటు చేసుకోగలిగితే కిందిస్థాయిలో ఉండే సమస్యలు అర్థమవుతాయని అన్నారు. పోలీస్ శాఖ మానవీయ దృక్పథం కలిగి ఉండాలి.. కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడే మంచి ఫలితాలు, గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.