Cm Revanth – Harish Rao: కేసీఆర్ మీద ఒట్టేసి బీజేపీలో చేరనని చెప్పగలరా? హరీశ్ కి సీఎం రేవంత్ సవాల్

మీటింగ్ వదిలేసి మరీ హరీశ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదు.

  • Updated on- May 30, 2026 / 07:56 PM IST

Cm Revanth – Harish Rao: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదన్నారు. ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదన్నారు. కేసీఆర్ మీద ఒట్టేసి బీజేపీలో చేరనని హరీశ్ చెప్పగలరా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. 2008లో హరీశ్ రావు వైఎస్ ని కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారు నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బోధి పెవిలియన్ లో చిట్ చాట్ లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

”మీటింగ్ వదిలేసి మరీ హరీశ్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదు. ప్రాధమిక ఆధారాలతో 2 కేసులు సీబీఐకి ఇచ్చా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 2034 వరకు తెలంగాణలోనే ఉంటా. ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన. నాలో చిన్న మార్పు కూడా లేదు” అని సీఎం రేవంత్ అన్నారు.

ఏడాదికి 70 వేల కోట్లు అప్పు చేస్తే 95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు మేము తీరుస్తున్న అప్పుల గురించి చెప్పడం లేదని ధ్వజమెత్తారు. 54 వేల కోట్ల అప్పులు తీసుకుంటామని మేము ముందే చెప్పామని రేవంత్ గుర్తు చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదన్నారు.

భీమవరంలో పోటీ చేస్తానన్నప్పుడు ఏమైంది మీ తెలివి?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు మీరు ఏం చేశారు? భీమవరంలో పోటీ చేస్తానన్నప్పుడు ఏమైంది మీ తెలివి? ఏపీలో టీఆర్ఎస్ కమిటీ వేసినప్పుడు సిగ్గనిపించలేదా..? ఎందుకా సిగ్గుమాలిన బతుకు? అంటూ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ కుటుంబం ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, శక్తులు ప్రదర్శించినా తనను ఏమీ చేయలేరని రేవంత్ అన్నారు. తనకు ఓ ప్లాన్ ఉందని, ప్రతీ దానికి తన దగ్గర ఓ పరిష్కారం ఉందని చెప్పారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సైతం సవాల్ విసిరారు సీఎం రేవంత్. జూన్ 15 వరకు ప్రతి గింజను కొంటామన్నారు. ధాన్యాన్ని ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి కొనిపించాలన్నారు. లేదంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇళ్ల ముందు ధాన్యం పోస్తామన్నారు. జూన్ 15 తర్వాత కిషన్ రెడ్డి, మోదీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, తనది సక్సెస్ కాంబినేషన్ అన్నారు రేవంత్ రెడ్డి. ఇద్దరి కాంబినేషన్ లో అన్ని ఎన్నికలు గెలిచామన్నారు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని, పార్టీని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. అంతేకాదు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహేశ్ గౌడ్ కి మంచి పదవి రావొచ్చని, మంత్రి కూడా కావొచ్చని అన్నారు.

Also Read: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5వేల పోస్టుల భర్తీకి సర్కార్ నిర్ణయం..